- లంచం ఆరోపణల కలకలం!
RTC conductor inspector fight | సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్ మరియు కొందరు ప్రయాణికులు కలిసి దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. లంచం డిమాండ్ చేశారంటూ కండక్టర్ ఆరోపించగా.. నిబంధనల ఉల్లంఘనను ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని ఇన్‌స్పెక్టర్ పేర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద అధికారులు టికెట్ చెకింగ్ కోసం ఆపారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని ఇన్‌స్పెక్టర్ గుర్తించారు.
అయితే టికెట్ లేని ప్రయాణికుడిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ఇన్‌స్పెక్టర్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారని బస్సు కండక్టర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి ఇన్‌స్పెక్టర్‌పై పిడిగుద్దులు కురిపించారు.
ఇన్‌స్పెక్టర్ వాదన ఇదీ..
మరోవైపు ఈ దాడిపై టికెట్ ఇన్‌స్పెక్టర్ రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలకు ఉద్దేశించిన ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ టికెట్‌ను ఒక పురుష ప్రయాణికుడికి కండక్టర్ ఎలా జారీ చేస్తారని తాను ప్రశ్నించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ నిబంధనల ఉల్లంఘన బయటపడితే తనపై చర్యలు తీసుకుంటారనే భయంతోనే కండక్టర్ ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఒకే శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య లంచం, నిబంధనల ఉల్లంఘనల చుట్టూ జరిగిన ఈ వివాదం ప్రస్తుతం ఆర్టీసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







