Peta Gifts Robotic Elephant To Temple | కేరళ ఆలయ సంస్కృతిలో గజరాజులకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుతూనే, మూగజీవాల పట్ల హింసను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికత తోడైంది.
త్రిసూర్ జిల్లా మాలలోని పున్నక్కపరంబిల్ శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి పెటా ఇండియా (PETA India) మరియు ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే ఫౌండేషన్ సంయుక్తంగా ఒక భారీ రోబోటిక్ ఏనుగును బహూకరించాయి.
ఈ రోబోటిక్ ఏనుగుకు ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అని పేరు పెట్టారు. మలయాళ నూతన సంవత్సరం ‘విషు’ పండుగ (ఏప్రిల్ 14, 2026) సందర్భంగా శాంతిగిరి ఆశ్రమానికి చెందిన స్వామి మధురానాథన్ జనతాపస్వి ఈ రోబో ఏనుగును ఆవిష్కరించారు.
సుమారు 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఈ ఏనుగు విద్యుత్ సహాయంతో పనిచేస్తుంది. ఇది తల ఊపడం, కళ్ళు ఆడించడం, తోక ఊపడం వంటి పనులు అచ్చం అసలు ఏనుగులాగే చేయగలదు. దీనిని సుమారు రూ. 5.31 లక్షల వ్యయంతో నిర్మించారు.
ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను గంటల తరబడి బంధించి ఉంచడం, అధిక శబ్దం మధ్య ఉంచడం వల్ల అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. రోబోటిక్ ఏనుగు వల్ల ఈ హింసకు తావుండదు.
ఏనుగులు బెదిరినప్పుడు తలెత్తే తొక్కిసలాట ప్రమాదాల నుండి భక్తులకు పూర్తి రక్షణ ఉంటుంది ఏనుగు లేకుండా ఉత్సవం పూర్తికాదు అనుకునే చోట, ఈ రోబోటిక్ ఏనుగులు ఆ లోటును తీరుస్తూ వైభవాన్ని కాపాడుతున్నాయి. కేరళలో పెటా ఇండియా సహకారంతో ఆలయాలకు అందించిన 14వ రోబోటిక్ ఏనుగు ఇది.






