CM Revanth Reddy letter to PM Modi | లోకసభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గళాన్ని మరింత పెంచారు.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన విడివిడిగా బహిరంగ లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్లను పునర్విభజనతో ముడిపెట్టవద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, దీనికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, దీనిని నియోజకవర్గాల పెంపుతో ముడిపెట్టి జాప్యం చేయవద్దని కోరారు.
పునర్విభజనపై ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదన..
జనాభా ప్రాతిపదికన మాత్రమే లోకసభ సీట్లను పెంచితే కుటుంబ నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా ఆయన ‘GSDP ఆధారిత హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదించారు:
సీట్ల విభజన ఫార్ములా..
పెంచాలనుకుంటున్న అదనపు సీట్లలో (ఉదాహరణకు 272 సీట్లు అనుకుంటే) 50 శాతం సీట్లను ‘ప్రో-రేటా’ (Pro-rata) పద్ధతిలో, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాతిపదికన కేటాయించాలని సీఎం రేవంత్ ప్రదిపాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా సహకరిస్తున్న రాష్ట్రాలకు ఈ పద్ధతి ద్వారా తగిన ప్రాధాన్యత దక్కుతుందని ఆయన వివరించారు.
దక్షిణాది సీఎంలకు లేఖలు..
కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతాయని, అందుకే అందరం కలిసికట్టుగా పోరాడాలని రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
పునర్విభజనపై ముందుగా అఖిల పక్ష భేటీ నిర్వహించి, జాతీయ స్థాయిలో విస్తృత అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.






