- జూలై 3 నుంచి దర్శనాలు..
– ఏప్రిల్ 15 నుంచే రిజిస్ట్రేషన్లు!
– యాత్రకు వెళ్లేవారు పాటించాల్సిన నియమాలివే..
Amarnath Yatra 2026 Dates | పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లే శివభక్తుల నిరీక్షణకు తెరపడింది. 2026 ఏడాదికి సంబంధించిన యాత్ర షెడ్యూల్‌ను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారికంగా ప్రకటించారు.
మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్రకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా బాబా బర్ఫానీకి తొలి పూజ నిర్వహిస్తారు. జూలై 3 నుంచి భక్తులను అనుమతిస్తారు. ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున యాత్ర ముగుస్తుంది. ఏప్రిల్ 15, 2026 నుండి నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి..
భక్తులు రెండు పద్ధతుల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. శ్రీ అమర్నాథ్ జి ష్రైన్ బోర్డు (SASB) అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్ వంటి 550కి పైగా బ్యాంక్ శాఖలలో నేరుగా నమోదు చేసుకోవచ్చు. యాత్రలో ఉండే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వయోపరిమితిని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు.
13 ఏళ్ల లోపు చిన్నారులు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు యాత్రకు అనుమతి లేదు. ఆరు వారాల కంటే ఎక్కువ గర్భం ఉన్న మహిళలకు కూడా అనుమతి ఉండదు. ప్రతి యాత్రికుడు ప్రభుత్వం గుర్తించిన డాక్టర్ నుంచి హెల్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
భక్తులు సంప్రదాయబద్ధమైన పహల్గామ్ మార్గం లేదా కొంత కష్టతరమైన బాల్తాల్ మార్గం ద్వారా గుహను చేరుకోవచ్చు.
అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ గుహలో ఏటా సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా మంచు లింగం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.






