Saturday 11th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అనంత ఎండల్లో ‘యాపిల్’ సిరి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

అనంత ఎండల్లో ‘యాపిల్’ సిరి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

apples farming in ananthapuram

45 డిగ్రీల వేడిలోనూ ఎర్రటి దిగుబడి..
– టన్ను యాపిల్స్ తో రూ. 1.50 లక్షల లాభం!

Anantapur Farmer Apple Farming | అనంతపురం జిల్లా అంటేనే కరువుకు, భానుడి భగభగలకు కేరాఫ్ అడ్రస్. కానీ, అదే ఎర్రటి నేలపై ఇప్పుడు చల్లని ప్రదేశాల్లో పెరిగే యాపిల్స్ విరగ్గాశాయి. గార్లదిన్నె మండలం మార్తాండ గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

ఇజ్రాయెల్ స్నేహితుడి సలహాతో మలుపు..
గతంలో కొన్ని యాపిల్ మొక్కలు నాటి విఫలమైనా, రమణారెడ్డి వెనకడుగు వేయలేదు. తన ఇజ్రాయెల్ స్నేహితుడి సలహాతో, వేడి వాతావరణాన్ని తట్టుకునే KLD అనే ప్రత్యేక యాపిల్ రకాన్ని ఎంచుకున్నారు.

దాదాపు 1,500 మొక్కలను ఎకరంన్నర విస్తీర్ణంలో నాటారు. ఒక్కో మొక్కకు రూ. 650 చొప్పున పెట్టుబడి పెట్టారు. అనంతపురం మండుటెండలను, ముఖ్యంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకుని ఈ KLD రకం మొక్కలు అద్భుతమైన దిగుబడిని ఇచ్చాయి.

మార్కెట్లో సత్తా..
తాజాగా రమణారెడ్డి సుమారు ఒక టన్ను యాపిల్స్ దిగుబడి సాధించారు. బెంగళూరుకు చెందిన ఒక రిటైల్ అవుట్‌లెట్ ఈ పంటను కిలో రూ. 150 చొప్పున మొత్తం రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేసింది.

సాధారణంగా హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చే యాపిల్స్ తో పోలిస్తే, ఇక్కడి కాయలు ఎంతో రుచిగా, నాణ్యంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసలు..
రైతు రమణారెడ్డి సాధించిన ఈ ఘనతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

“వినూత్నంగా ఆలోచించి, సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తున్న రమణారెడ్డి లాంటి రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని ఆయన అభినందించారు.

ఈ విజయం కేవలం రమణారెడ్డిది మాత్రమే కాదు.. ఆధునిక సాగు పద్ధతులతో ఏ పంటనైనా పండించవచ్చని నిరూపించిన ప్రతి రైతుది. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల రైతులు ఈ యాపిల్ తోటను చూసేందుకు క్యూ కడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions