Friday 10th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ రాజకీయాల్లోకి సీఎం.. త్వరలోనే ముఖ్యమంత్రి రాజీనామా!

ఢిల్లీ రాజకీయాల్లోకి సీఎం.. త్వరలోనే ముఖ్యమంత్రి రాజీనామా!

nithish kumar takes oath as rs member

CM Nitish Kumar Takes Oath As RS Member | బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త మలుపు తీసుకున్నారు.

శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇకపై జాతీయ రాజకీయాల్లోనే క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు స్పష్టమైంది.

అరుదైన రికార్డు.. నాలుగు చట్టసభల్లోనూ సభ్యుడిగా!
ఈ ప్రమాణస్వీకారంతో నితీశ్ కుమార్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశంలోని నాలుగు అత్యున్నత చట్టసభల్లో సభ్యుడిగా పనిచేసిన అతికొద్ది మంది నేతల జాబితాలో ఆయన చేరారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, లోక్ సభ, రాజ్య సభ్యులుగా పనిచేశారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా..
రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మార్చి 30న తన ఎమ్మెల్సీ పదవికి నితీశ్ రాజీనామా చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీలో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. “బిహార్‌ కోసం చాలా చేశాను. ఇకపై ఢిల్లీలో ఉండి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. మూడు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి, మంత్రిమండలి కొలువుదీరుతుంది” అని స్పష్టం చేశారు.

నితీశ్ రాజకీయ ప్రస్థానం..

1985లో నీతిశ్ కుమార్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2005 నవంబర్ నుంచి నితీశ్ బిహార్ రాజకీయాలను శాసిస్తున్నారు.

విశేషమేమిటంటే, సీఎం అయినప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేయకుండా, 2006 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై సభను నడిపించారు.

బిహార్ లో తదుపరి సీఎం ఎవరు?
నితీశ్ కుమార్ నిష్క్రమణతో బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. జేడీయూ నుంచి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

అటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో నితీశ్ రాకతో జాతీయ స్థాయిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions