Supreme Court verdict on SC status conversion | మత మార్పిడి చేసుకున్న వ్యక్తులకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా క్రైస్తవం లాంటి ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులు, షెడ్యూల్డ్ కులాలకు (SC) లభించే రాజ్యాంగపరమైన హక్కులను, రక్షణలకు పొందలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ప్రకారం.. ఎస్సీ హోదా అనేది కేవలం నిర్దేశించిన మతాలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా వేరే మతంలోకి మారి, ఆ మత ఆచారాలను పాటిస్తున్నప్పుడు, వారికి ఎస్సీ హోదా ఆధారంగా వచ్చే ప్రయోజనాలు నిలిచిపోతాయి.
క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తిపై కులం పేరుతో దూషణలు లేదా దాడులు జరిగినప్పుడు, వారు ‘ఎస్సీ/ఎస్టీ (నిరోధక) అట్రాసిటీ చట్టం’ కింద రక్షణ పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. సంఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి ఏ మతాన్ని అనుసరిస్తున్నారనేదే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పాస్టర్ దాఖలు చేసిన కేసును విచారిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.






