Wednesday 18th March 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ‘అందమైన ఆంటీలతో మాటలు’.. నమ్మితే కొంప కొల్లేరే!

‘అందమైన ఆంటీలతో మాటలు’.. నమ్మితే కొంప కొల్లేరే!

cyber crime alert

VC Sajjanar Cyber Crime Warning | “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి..” అంటూ సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక భయంకరమైన సైబర్ నేరాలు దాగి ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP VC Sajjanar) హెచ్చరించారు. తీయటి మాటలతో ఊరించి, నిలువునా దోచుకునే ఈ ‘హనీట్రాప్’ ఉచ్చులో పడవద్దని ఆయన యువతను కోరారు.

ఏఐ (AI) మాయాజాలం.. నకిలీ అందాలు

సోషల్ మీడియా యాడ్స్‌లో కనిపిస్తున్న ఆకర్షణీయమైన అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన నకిలీ వీడియోలని సీపీ స్పష్టం చేశారు. కేవలం యువతను ఆకర్షించడానికి మాత్రమే వీటిని వాడుతున్నారని తెలిపారు.

యాప్ ఇన్‌స్టాల్ చేస్తే అంతే సంగతులు!

కేటుగాళ్లు పంపే లింకుల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని ఆయన హెచ్చరించారు. యాప్ ఇన్‌స్టాల్ చేయగానే ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ సమాచారం మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది.

వీడియో కాల్ చేసినప్పుడు అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, బాధితుడి ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియోను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ ‘సెక్స్‌టార్షన్’ (Sextortion) కు దిగుతారు.

పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని సజ్జనర్ హెచ్చరించారు.

కఠిన చర్యలు తప్పవు

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై నిఘా ఉంచామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, అనుమానాస్పద యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions