Gautam Gambhir vs Oval pitch curator | లండన్ లోని ఓవల్ స్టేడియం పిచ్ క్యూరేటర్ మరియు టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి ఇంగ్లాండ్-ఇండియా మధ్య ఐదవ టెస్టు మ్యాచ్ జరగనుంది. లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంతలోనే పిచ్ క్యూరేటర్ అయిన లీ ఫోర్టీస్ అక్కడికి చేరుకుని టీం ఇండియా సిబ్బంది, ఆటగాళ్లకు ఏదో చెప్పాడు. ఇదే వాగ్వాదానికి కారణం అయ్యింది. ‘నువ్వు ఇక్కడ కేవలం స్టేడియం సిబ్బందివి మాత్రమే. టీం ఇండియా ఏం చేయాలో నువ్వు చెప్పనక్కర్లేదు. మాకు తెలుసు’ అని గంభీర్ సీరియస్ గా అతనికి చెప్పారు.
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటాక్ అక్కడికి చేరుకొని, క్యూరేటర్ ను కాస్త దూరం తీసుకెళ్లారు. అయినప్పటికీ గంభీర్ క్యూరేటర్ మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటాక్ వాగ్వాదంపై స్పందించారు.
టీం ఇండియా సిబ్బంది, ఆటగాళ్లు పిచ్ ను పరిశీలిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన క్యూరేటర్ పిచ్ నుంచి దూరంగా వెళ్లాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇదే వాగ్వాదానికి దారి తీసిందని వివరించారు. కానీ పిచ్ ను పరిశీలిస్తే తప్పేమీ కాదన్నారు.










