Eatala Rajender | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే క్షేత్రస్థాయిలో ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు పైఎత్తులతో, వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ క్యాడర్‌ను అయోమయానికి గురిచేసే విధంగా సీనియర్ నేత ఈటల రాజేందర్ మీద ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. 17 పార్లమెట్ సీట్లు ఉన్న తెలంగాణలో 10కి పైగా సీట్లలో బీజేపీ గెలవబోతోందని వివిధ సర్వేలు తేల్చి చెప్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడేలా లేదని, కాంగ్రెస్‌కే మంచిరోజులుంటాయనే ఆలోచనతో ఈటల కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారని విష ప్రచారం చేసి శునకానందాన్ని పొందుతున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
తాజాగా తనపై వస్తున్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కూడా స్పందించారు. తాను బీజేపీని వీడడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రచారం చేస్తోందని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని, పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. కష్టకాలంలో ఆదుకుని ఆశ్రయం కల్పించిన పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుస్తుందన్నారు. తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కూటమికి బీటలు పడ్డాయన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేకనే రోజుకో పార్టీ కూటమి నుంచి తప్పుకుంటున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని క్లారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారాని తెరలేపిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు మంచివి కాదని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.