Ys Sharmila On PDS Rice Smuggling | ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం ( Ration Rice ) అక్రమ రవాణాపై రాజకీయ దుమారం నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Ys Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా, ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని షర్మిల అన్నారు. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని మండిపడ్డారు.
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని ఎద్దేవా చేశారు.
ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని, అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు, నిజాలు నిగ్గు తేల్చండి అని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.