S Keerthana TVK youngest MLA | ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వేళ, ఆయన మంత్రివర్గంలో 29 ఏళ్ల ఎస్. కీర్తన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తమిళగ వెట్రి కళగం (TVK) తరపున అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా, తొలి ప్రయత్నంలోనే మంత్రి పదవిని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కీర్తన.. కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ జిపై 11,670 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఏడు దశాబ్దాల్లో శివకాశి నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు.
చదువు పూర్తయ్యాక ఆమె రాజకీయ సలహాదారుగా (Political Strategist) కెరీర్ ప్రారంభించారు. ప్రఖ్యాత ఐప్యాక్ (I-PAC), షోటైమ్ కన్సల్టింగ్ వంటి సంస్థల్లో పనిచేశారు.
గతంలో ఆమె ఎంకే స్టాలిన్ (DMK), మమతా బెనర్జీ (TMC), మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (TDP) వంటి అగ్రనేతల ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.
ఈ అనుభవమే తనకు పాలనపై పట్టు సాధించేలా చేసిందని ఆమె చెబుతున్నారు. కీర్తనకు తమిళంతో పాటు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది.
హిందీ నేర్చుకోవడం వల్ల దేశవ్యాప్తంగా విజయ్ సందేశాన్ని తీసుకెళ్లడానికి సులువు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
టీవీకే నే ఎందుకు ఎంచుకున్నారంటే..
“రాజకీయ నేపథ్యం గానీ, ఆర్థిక బలం గానీ లేకపోయినా.. ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని విజయ్ గారు నిరూపించారు. అందుకే నేను టీవీకేని ఎంచుకున్నాను” అని కీర్తన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి, గణితం మరియు స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసిన కీర్తన.. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.







