Union Minister Bandi Sanjay | గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించనుంది. కొద్దిరోజులుగా సర్వేలు చేసి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల జాబితాలను సిద్ధం చేశారు.
గ్రామ సభలు నిర్వహించి.. ఆ జాబితాల్లో ఉన్న పేర్లను కూడా ప్రకటించారు. అయితే ఈ పథకాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు.
అంతేకాకుండా.. కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫొటోలు పెడితే కూడా.. ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమన్నారు. తామే స్వయంగా ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో.. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత రెడ్డికి కేసీఆరే గురువు అని విమర్శించారు.