Zombie Drug In USA | అమెరికాలో ఓ కొత్త జాంబీ డ్రగ్ కలవరపెడుతోంది. ముఖ్యంగా ఫిలడెల్ఫియాలో కొత్త స్ట్రీట్ డ్రగ్ వినియోగం యువతను సజీవ జాంబీల మాదిరిగా మారుస్తోంది.
ఈ డ్రగ్ తీసుకున్న వారి శరీరాలపై భయంకరమైన గాయాలు, పుండ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ వినియోగంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిలడెల్ఫియా వీధుల్లో ఈ డ్రగ్ తీసుకున్న వారి వీడియోలు వైరల్ గా మారాయి. వారి తీరు స్థానికంగా చాలా ఆందోళన కలిగిస్తోంది.

మొదట ఈ జాంబీ డ్రగ్ (Zombie Drug in USA) ను ఫిలడెల్ఫియాలో గుర్తించారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లోకి వ్యాప్తి చెందింది.
అసలేంటీ జాంబీ డ్రగ్?
గుర్రాలు, ఆవులు, ఎద్దులు ఇలా కొన్ని జంతువులకు విశ్రాంతి నివ్వడం కోసం జైలాజీన్ అనే డ్రగ్ ని ఉపయోగిస్తారు. వాటికి ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు అవి కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళతాయి.
అయితే ఈ డ్రగ్ కు ఫెంటానిల్ అనే డ్రగ్ ని కలిపినప్పుడు అది అత్యంత ప్రాణాంతకమైన మాదక ద్రవ్యంగా మారుతోంది.
జైలజీన్ సులభంగా లభిస్తుండటం, దీని తయారీకి అత్యంత తక్కువ ఖర్చు కావడంతో డ్రగ్ డీలర్లు దీన్ని విపరీతంగా విక్రయిస్తున్నారు.
ట్రాంక్, ట్రాంక్ డోప్ గా కూడా పిలిచే ఈ జాంబీ డ్రగ్ ను అమెరికా యువత విపరీతంగా తీసుకుంటున్నారు. దీని ప్రభావం కారణంగా వీధుల్లో డ్రగ్ కి బానిసైన వారు తూలుతూ జాంబీల్లా కనిపిస్తున్నారు.
అంతే కాదు ఈ జాంబీ డ్రగ్ దుష్రభావాలు తీవ్రంగా ఉన్నాయి. ఇది తీసుకున్న వారిలో శరీరంపై వీపరీతమైన పుండ్లు పడుతున్నాయి. చర్మం ఊడిపోతోంది.
ఈ డ్రగ్‌ను పదే పదే వినియోగిస్తే.. గాయాలు మరింత పెరిగి.. చివరకు ఆ వ్యక్తి చర్మం చాలా వరకు కుళ్ళిపోయే స్థితికి వస్తుంది. అప్పుడు ఆ గాయాలు లేదా పుండ్లను నయం చేయడం కష్టమవుతుంది.
చివరకు ఆయా అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుటికే చాలామందిలో జాంబీ డ్రగ్ కారణంగా ఏర్పడిన పుండ్ల వల్ల కాళ్లు, చేతులు తొలగించినట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఈ డ్రగ్ వినియోగం పెరగడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.