Dr Preethi Family | ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రీతి మరణంపట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ కవిత లేఖ యధాతథంగా..
“గౌరవనీయులైన నరేందర్ – శారద గారికి
సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని .
ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను.
చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.
Read Also: అమెరికాలో జాంబీ డ్రగ్ కలవరం.. శరీరంపై పుండ్లతో అవయవాల తొలగింపు!
కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది.
మీ కుటుంబానికి (Dr Preethi Family) సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను”