Mamata Banerjee As Lawyer | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసాకాండపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఆమె స్వయంగా న్యాయవాది గౌను ధరించి కలకత్తా హైకోర్టులో హాజరయ్యారు.
15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న దాడుల నుంచి ప్రజలను రక్షించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు.
“న్యాయమూర్తులందరికీ నా నమస్కారాలు. హైకోర్టులో నేను లాయర్‌గా హాజరుకావడం ఇదే తొలిసారి. న్యాయవాదిగా నేను ఈ కేసును పోరాడుతున్నాను” అంటూ ఆమె తన వాదనలు ప్రారంభించారు.
బాధితుల జాబితాను కోర్టుకు సమర్పిస్తూ.. “చిన్న పిల్లలు, మహిళలు, మైనారిటీలను కూడా వదలడం లేదు. హత్యకు గురైన పది మంది జాబితాను ఇస్తున్నాను. ఇందులో ఆరుగురు హిందువులే ఉన్నారు” అని ఆమె గణాంకాలతో సహా వివరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులు నిద్రిస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడానికి కూడా పోలీసులు సహకరించడం లేదని ఆరోపించారు.







