- రాజీవ్ యువ వికాసం ప్రారంభించిన సీఎం!
CM Revanth Launches Rajeev Yuva Vikasam | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక చేయూత అందించనుంది.
అందుకోసం రాజీవ్ యువ వికాసం (Rajeevi Yuva Vikasam) అనే పథకాన్ని రూపొందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం రాజీవ్ యువవికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కీంను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతలో 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు.
ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు అందిస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీం కోసం ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/ ను సందర్శించవచ్చు.