“ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు.”
సరిగ్గా 17 ఏళ్ల కిందట ఇదే రోజు తెల్లవారు జామున ఫ్యాన్ షోతో మారుమోగిన ఈ డైలాగ్ ప్రభంజనం ఓ ఏడాదిపాటు కొనసాగింది. ప్రభుత్వ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిని నిర్మూలించే అంశంతో తెరకెక్కిన చిత్రం ఠాగూర్.. మెగాస్టార్ సినీ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ మైల్‌స్టోన్. ఒక రకంగా చిరంజీవిని రాజకీయాల్లోకి లాగిన చిత్రంగా కూడా పేర్కొనొచ్చు.
వివి వినాయక్ డైరెక్షన్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్, లారెన్స్ డాన్సులు, చిరంజీవి మ్యానరిజం.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతీ సీన్ అభిమానులను ఉర్రూతలూగించింది. నిజంగా మెగాస్టార్‌ని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అవన్నీ వండి వార్చాడు డైరెక్టర్ వివి వినాయక్.
ఈ సినిమా రిలిజైన తర్వాత ఎంత ప్రభావం చూపిందంటే.. ప్రభుత్వ ఉద్యోగులు కొన్నాళ్లపాటు లంచాలు తీసుకోవడానికి భయపడ్డారట. అంతేకాదు.. అప్పట్లో కొన్ని టీవీ ఛానెళ్లు సినిమాలో ఉన్న ఏసీఎఫ్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను కూడా నడిపారు. ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే.. ఏసీఎఫ్ ప్రోగ్రామ్ నంబర్‌కి కాల్ చేయాలని చెప్పారు.
ఇన్ని ప్రత్యేకతలు సొంతం చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
- ఠాగూర్ అసలు స్ట్రయిట్ తెలుగు సినిమా కాదు. తమిళంలో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కెప్టెన్ విజయ్‌కాంత్ నటించిన రమణ సినిమాకు ఇది రీమేక్. కానీ తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.
- ఈ మూవీ నిర్మాత మధు.. తమిళంలో మురుగదాస్ విజయ్‌కాంత్‌కి కథ చెప్పినప్పుడే విన్నారట. ఎలాగైనా తెలుగులో మెగాస్టార్‌తో ఈ సినిమా తీయాలని చిరంజీవిని, అల్లు అరవింద్‌ని కలిసి కథ వినిపించారట.
- రమణ సినిమాను ప్రత్యేకంగా తెప్పించుకొని మరీ చూసిన చిరంజీవి ఎలాగైనా తనే నటించాలని డిసైడ్ అయ్యారట. అయితే డైరక్టర్ విషయంలోనే కాస్త సందిగ్ధత నెలకొంది. తెలుగులో కూడా మురుగదాస్‌తోనే డైరక్ట్ చేయలని మొదట భావించారు. కానీ, చిరంజీవి స్టార్‌డమ్‌ని సరిగ్గా చూపిస్తాడో లేదో అని వెనకడుగు వేశారట.
- ఆ తర్వాత చిరంజీవి అంతకుముందు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర డైరెక్టర్ బి. గోపాల్‌ని సంప్రదించారు. అయితే, అప్పటికే ఆది, చెన్నకేశవ రెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి తన టాలెంట్‌ను నిరూపించుకున్న మెగాభిమాని అయిన వివి వినాయక్‌నే అవకాశం వరించింది.
- డైరెక్టర్‌ని ఎంపిక చేయడం కంటే ముందే చిరంజీవి కోరిక మేరకు తమిళ మాతృక రమణను చూసిన మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి, మెగాస్టార్ మ్యానరిజంకు తగిన విధంగా డైలాగులు రాశారు.
- సినిమాలో జ్యోతిక పాత్రకు ముందు మాధురీ దీక్షిత్ అనుకున్నారట. కానీ, అప్పుడు ఆమె ప్రెగ్నెన్సీతో ఉండటంతో ఆ అవకాశం జ్యోతికను వరించింది. ఈ సినిమాలో చిరంజీవి స్టూడెంట్ అయిన గోపి అనే పాత్రలో నటించాడు డైరెక్టర్ వినాయక్.
- కథ, డైలాగులు, దర్శకుడు అన్నీ ఓకే అయినా తర్వాత టైటిల్ విషయంలో సందిగ్ధంలో పడ్డారు. ఈ సినిమాకు చిరంజీవి సూర్యం అనే పేరు సూచించారు. ఎందుకంటే ఖైది సినిమాలో చిరంజీవి కారెక్టర్ పేరది. ఆ పేరంటే చిరంజీవికి చాలా ఇష్టమని సూచించారట. అయితే పరుచూరి వెంకటేశ్వర రావు ఠాగూర్ అని సూచించడంతో, కొత్తగా ఉందని ఓకే చేశారు.
- సినిమాకు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అన్ని పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శ్రీశ్రీ కవిత్వం ఆధారంగా సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం పాట సినిమాకే హైలెట్. ఈ పాటకు గానూ సుద్దాల జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. సినిమాలో పాటల కోసం మణిశర్మ 62 ట్యూన్స్ వినిపించారట.
- వాస్తవానికి తమిళ మాతృక రమణలో హీరో క్యారెక్టర్‌ను ఉరి తీస్తారు. కానీ, ఠాగూర్‌లో కూడా చిరంజీవి పాత్రను ఉరి తీస్తే అభిమానులు అంగీరించలేరని భావించిన యూనిట్ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పుల కోసం డైరెక్టర్ వినాయక్ ఏకంగా ఓ హైకోర్టు రిటైర్డ్ జడ్జి సలహా తీసుకున్నారట.
అలా మొత్తానికి సినిమా పూర్తయి.. 2003 సెప్టెంబర్ 24న.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600కు పైగా థియేటర్లలో రిలిజై ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 35 కోట్లకు పైగానే. అప్పట్లో అదో రికార్డు.
👍👍👍