Sankranthi Memories | అసలు సిసలైన అచ్చ తెలుగు లోగిళ్ల పండుగ సంక్రాంతి..
పల్లె, పట్నం పడుచుల అందాల రంగవళ్లుల మురిపెం సంక్రాంతి..
నిండు నీలాకాశంలో పతంగులతో పోటీపడే కుర్రాళ్ల సందడి సంక్రాంతి..
కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో సంక్రాంతి పండుగ సంబురం పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమ ప్రభావమో, మరేదైనా కావొచ్చు.. సంక్రాంతి అంటే ఆంధ్రుల పండగ.. దసరా అంటే తెలంగాణ పండగ అనే భావన బాగా ఏర్పడింది.
కానీ దసరా అయినా సంక్రాంతి అయినా ఇవి తెలుగు లోగిళ్ల పండగలు. గతంలో సంక్రాంతి పండగను తెలంగాణలోనూ ఘనంగా జరుపుకునేవారు. ఇప్పుడు జరపుకోవడం లేదని కాదు కానీ.. గతంలో ఉన్న సంబరం కాస్త కరువైనట్లనిపిస్తోంది.
సంక్రాంతి అంటే ఆంధ్రులకే కాదు తెలంగాణలో కూడా ఆడపడుచులకు కూడా ఈ ముగ్గుల పండగంటే సంబురమే. ఇక కుర్రాళ్ల పతంగుల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెలంగాణలో సంక్రాంతి పండుగ ఎంతో సంబురంగా జరుపుకునేటోళ్లం అంటూ తన చిన్ననాటి పతంగుల పండగ జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఓ ఎన్ఆర్ఐ అంతరంగం!!
“సంక్రాంతి జ్ఞాపకం :
మాది యాదాద్రి భువనగిరి జిల్లా (అప్పటి నల్లగొండ) భూదాన్ పోచంపల్లి (చేనేతకు ఫేమస్) మండలం శివారెడ్డి గూడెం అనే చిన్న ఊరు. తెలంగాణ లోని అనేక పల్లెలాగే కులామతాలకు అతీతమైన బంధుత్వాలకు పుట్టినిల్లు.
మా చిన్నప్పుడు పతంగుల పండుగ (సంక్రాంతి) మస్త్ చేస్కునెటోళ్లం.
ఈ తరం పోరగాళ్లల్ల ఆ పండగ సంబురం కనిపిస్తలేదు. అందుకే మా జ్ఞాపకాలను గుర్తు చేస్కోవాలనిపించింది. సంక్రాంతి పండగంటే మాకు శానా సంబురం. పొద్దుగాల కోడిగుయ్యంగనే లేశి సోపతి గాళ్ళతోటి మా బాయికాడికి పోతుండే.
మోటర్ పంపు నుండి వచ్చే గోరువెచ్చని నీళ్లతోటి స్నానం చేస్తుండే. అటెన్క రేగు పండ్లు, గరికే ఆకులు, పిండి కొమ్మలు, ఆవు పెండ (గొబ్బెమ్మలు చేయడానికి) తీసుకొని పొయ్యేటోళ్ళం. మా బాయికాడ రేగు చెట్టు శానా ఉంటుండే.
నా దోస్తుగాళ్లే మస్తు మంది వచ్చి సంక్రాంతి రోజున రేగు పండ్లు, గరికే ఆకులు, పిండి కొమ్మలు తీసుకపోయేటోళ్లు మా బాయి కాడ్నించి. ఇగ ఈత కల్లు, తాటి కల్లు గురించి ఐతే చెప్పె ముచ్చటే లేదు. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. ఎన్నిసార్లు తలచుకున్నా బోర్ కొట్టదు.
ఆకిట్ల(వాకిలి) మా ఇండ్లళ్ల అమ్మనో అక్కనో చెల్లేనో పెద్ద పెద్ద ముగ్గులేస్తుండే. మేం తీస్కవొయిన ఆవు పెండతోటి గొబ్బెమ్మలు జేసి, దాని సుట్టూ రేగుపండ్లు పెట్టేటోళ్లం. పొద్దుగాల్నే నాలుగు ఐదు గంటలకు బాలసంతోడు వచ్చి ఊదు పొగతోటి ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేశెటోడు.
హరిదాసులు కీర్తనలు పాడెటోళ్లు. గంగెడ్లోళ్లు వచ్చి ఊరంతా తిరిగి గంగిరెద్దు ఆట ఆడించేటోళ్ళు. స్కూళ్ల సదుకునే టైంల సంక్రాంతి పండుగప్పుడు పది పదిహేను రోజుల శెలవులు ఇస్తుండే.
మా ఊర్ల సీత లక్ష్మయ్య అప్పట్లో పతంగులు అమ్మేటోడు. పతంగులు తీసుకొని పటేలోళ్ళ శెల్కలకు పోయి పతంగులు ఎగరేసేటోళ్లం. మాంజా దారంతో కట్టిన పతంగులతో ఒకరికొకరం పోటీ పెట్టుకొనేటోల్లం. ఎవరి పతంగి తెగితే వాళ్ళు ఓడిపోయినట్లు. సంక్రాంతి పండుగ సంబురం మూడు రోజులూ ఉండేది.
హరిదాసులు, బాలసంతోడు, గంగిరెద్దుల వాళ్ళ హడావిడితో పెద్ద పండగ వాతావరణం ఉండేది మన ఊళ్ల.
కానీ.. ఇప్పుడు.. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అన్నట్లుగా ఇప్పుడు ఊర్లల్ల పండగల పరిస్థితి కూడా అట్నే ఉంది. పండగల్లేవు. ప్రశాంతమైన పండుగ వాతావరణం లేదు. రేగు చెట్లు లేవు. చిప్పాలపండ్ల (సీతాఫలం) చెట్లు లేవు. మామిడి చెట్లు కూడ తక్కువే ఇప్పుడు.
ఇప్పటి పిల్లలకు ఇలాంటి ఆ చిన్న చిన్న ఆనందాలు కరువైనయి. పోరగాళ్లు పొద్దుగాల లేస్తే laptop ల లేదా ఫొన్ల లో లేదా టీవీలల్ల మొఖాలు పెడుతుండ్రు. వాటిల్లనే బిజీ అయ్యిపోతున్నరు. గ్రౌండ్లకు వొయ్యి ఆడే క్రికెట్, కబడీ రాన్రాను మర్చిపోతున్రు.
ఏమైనా ఫోన్లలో pubg లు fortnite గేములాడుకుంట బిజీ అయితున్నరు. ఏదైమైనా పల్లెటూర్లల్ల అప్పటి పండగ వాతావరణం కనిపిస్తలేదు. పాత జ్ఞాపకాలు నెమరేసుకోవడం తప్ప చేసేడిదేమి లేదు. బరువైన హృదయంతో చిన్ననాటి పంతంగుల పండుగ పాత జ్ఞాపకాలను తలచుకొంటూ..