Monday 23rd November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తండ్రి లేని లోటు తెలియకుండా కూతురి పెళ్లి జరిపించిన సైనిక సోదరులు!

తండ్రి లేని లోటు తెలియకుండా కూతురి పెళ్లి జరిపించిన సైనిక సోదరులు!

Jawans Perform Late Havildar Daughter Wedding కన్న కూతురి పెళ్లి వేళ పక్కన నిలబడి ఆశీర్వదించాల్సిన తండ్రి లేకపోతే ఆ బాధను, ఆ లోటును ఎవరూ పూడ్చలేరు. పెళ్లి పీటలపై కూర్చున్న ప్రీతి మనసులోనూ సరిగ్గా అదే వేదన మెదిలింది.

కానీ, ఆ శుభకార్యంలో ఆమెకు తండ్రి లేని లోటు ఏమాత్రం కనిపించకుండా ఒక అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ రక్షణలో తన తండ్రితో కలిసి సరిహద్దుల్లో తుపాకులు పట్టిన సైనిక సోదరులు ఆ పెళ్లికి కదలివచ్చారు. కేవలం తోటి ఉద్యోగులుగానో, అతిథులుగానో కాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా, అన్నదమ్ముల్లా దగ్గరుండి వివాహాన్ని ఘనంగా జరిపించారు.

దివంగత జవాన్ కుటుంబానికి అండగా..

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా హర్సోలీ గ్రామంలో శనివారం (నవంబర్ 21) ఈ భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. దివంగత హవల్దార్ పప్పల్ సింగ్ గతంలో భారత సైన్యంలోని 16వ జాట్ రెజిమెంట్‌లో దేశానికి సేవలందించారు. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన కుటుంబాన్ని తమ సొంత కుటుంబంగా భావించిన ఆ రెజిమెంట్ సైనికులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు (JCOs), ఇతర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ప్రీతి వివాహానికి హాజరయ్యారు.

రూ. 1.61 లక్షల ఆర్థిక సహాయం..

పెళ్లి ఖర్చుల నిమిత్తం సైనికులంతా కలిసి తమ వంతుగా రూ. 1.61 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యూనిట్ తరఫున రోష్ని ధావల్.. ప్రీతి తల్లి అనితా దేవికి శాలువా కప్పి, బంధుమిత్రుల సమక్షంలో సముచితంగా గౌరవించిన తీరు అక్కడున్న వారందరి కళ్లను చెమర్చింది.

అన్నదమ్ముల్లా పెళ్లి పనులు చూసుకున్న జవాన్లు..

సుబేదార్ వీరేంద్ర కుమార్ ధావల్, నాయిబ్ సుబేదార్ సుబే సింగ్, హవల్దార్ సతీష్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్, నాయక్ లోకేష్, నాయక్ సోహన్ సింగ్, అగ్నివీర్ దివాకర్‌లతో పాటు పలువురు జవాన్లు పెళ్లి వేడుకలో ప్రతి పనినీ తమ భుజాలపై వేసుకుని నిర్వహించారు.

తోటి సైనికుడు లేకపోయినా ఆయన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదుకున్న ఆ జవాన్ల ఔదార్యాన్ని చూసి గ్రామస్థులు, పెళ్లికొడుకు తరఫు బంధువులు చేతులెత్తి మొక్కుతూ ప్రశంసలు కురిపించారు. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పెనవేసుకున్న సైనిక బంధం ఎంతటి పవిత్రమైనదో, ‘సేవా పరమో ధర్మః’ అనే నినాదానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

You may also like
ఒక్క హారన్ కూడా మోగదు.. ఐజ్వాల్ ప్రజల క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions