- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం!
Cabinet Approves Capex Support Scheme Critical Minerals దేశంలో లిథియం, నికెల్ వంటి క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర గనుల శాఖ ప్రతిపాదించిన రూ.2,814 కోట్ల ‘క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్’ (Capex Support Scheme) కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
2047 నాటికి ‘వికసిత భారత్’ సాధనలో బొగ్గు, గనుల రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఆత్మనిర్భరత సాధించడమే లక్ష్యంగా ఈ పథకం తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
రూ.10,000 కోట్ల పెట్టుబడులు..
ఈ కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా దేశంలోకి దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఏటా రూ.25,000 కోట్ల విలువైన ప్రాసెస్డ్ మినరల్స్ ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు. క్రిటికల్ మినరల్స్ పరిశ్రమ విస్తరణతో భారీగా స్థానిక ఉపాధి పెరుగుతుందని, అనుబంధ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
దిగుమతుల భారం తగ్గింపు..
ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి లిథియం, నికెల్ అత్యంత కీలకం. 2017-18లో రూ.6,500 కోట్లుగా ఉన్న లిథియం దిగుమతులు ప్రస్తుతం రూ.50,000 కోట్లకు పెరిగాయని, ఈ పథకం ద్వారా దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో..
సప్లయ్ చైన్ బలోపేతం కోసం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో 4 క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
అలాగే, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ ప్రోగ్రామ్, క్లీన్ ఎనర్జీ, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అవసరమైన క్రూడ్ మినరల్స్‌ను అందించడంలో ఈ క్యాపెక్స్ పథకం వెన్నుముకగా నిలుస్తుందన్నారు.
జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్..
విదేశాల్లో మినరల్ సెక్యూరిటీ కోసం పబ్లిక్ సెక్టార్ సంస్థ ‘KABIL’ ద్వారా అర్జెంటీనాలో 5 లిథియం మైనింగ్ బ్లాకులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జీఎస్ఐ (GSI) ద్వారా దేశంలో 901 ప్రాజెక్టులు చేపట్టగా, 56 క్రిటికల్ మినరల్ బ్లాకులను విజయవంతంగా వేలం వేశామన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలలో 9 ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ అందుబాటులోకి తెచ్చామన్నారు.
మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్ల పథకాన్ని తెచ్చామని, గనుల వ్యర్థాల (Overburden & Tailings) నుంచి కాడ్మియం (1,486 టన్నులు), వెనెడియం (1,261 టన్నులు) సేకరించడం ప్రారంభమైందని మంత్రి తెలిపారు.











