- సెప్టెంబర్, అక్టోబర్‌లలో సేవలకు అంతరాయం!
Bank Employees Nationwide Strike దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. 5 రోజుల పనిదినాలు, పీఎల్‌ఐ (PLI) విధానంలో మార్పులు వంటి తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) విఫలమయ్యాయని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక (UFBU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
దశలవారీగా నిరసనల షెడ్యూల్..
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె, సెప్టెంబర్ 28 నుండి 30 వరకు: వరుసగా మూడు రోజుల పాటు సమ్మె.ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు స్పష్టం చేశాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే..
12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు ఉద్యోగులు అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఈ విధానాన్ని ఇంకా ఆమోదించలేదు. కేంద్ర ఆర్థిక శాఖ తెచ్చిన సవరించిన పీఎల్‌ఐ విధానం వల్ల స్కేల్-4 ఆపై అధికారులకు గరిష్ఠంగా 365 రోజుల బేసిక్ పే లభిస్తుండగా, స్కేల్-3 వరకు ఉన్న సిబ్బందికి కేవలం 15 రోజుల బేసిక్ పే మాత్రమే అందుతోంది.
బ్యాంకు మొత్తం పనితీరు ఆధారంగా స్కేల్-7 వరకు అందరికీ ఒకే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు. పెన్షన్ల సవరణ, పెన్షనర్లందరికీ ఒకే డీఏ ఫార్ములా అమలు మరియు ఎన్‌పీఎస్ (NPS) ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి (OPS) మారే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.







