- అమేథీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరికొత్త రికార్డు!
Fully Indigenous AK-203 Rifle Sher భారత రక్షణ తయారీ రంగంలో స్వావలంబన (ఆత్మనిర్భరత) దిశగా మరో భారీ మైలురాయి నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ కోర్వా ఆయుధ కర్మాగారంలో విదేశీ భాగాలు ఏవీ లేకుండా, 100 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ముడి పదార్థాలతో తయారైన సరికొత్త AK-203 అసాల్ట్ రైఫిల్‌ను ఆవిష్కరించారు. ఈ రైఫిల్‌కు “షేర్” అని నామకరణం చేశారు.
ఏకే-203 ‘షేర్’ – పూర్తి స్వదేశీ ప్రస్థానం..
2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్-రష్యాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ‘ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (IRRPL) ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కోర్వా ఫ్యాక్టరీలో నిర్వహించిన ఆటోమేటిక్, బరస్ట్ ఫైరింగ్ ట్రయల్స్‌ను ‘షేర్’ విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఏకే-203లో ఉండే 50 ప్రధాన భాగాలు, 180 ఉప భాగాలు, దాదాపు 120 తయారీ ప్రక్రియలను దేశీయ సరఫరాదారుల ద్వారా సిద్ధం చేశారు. 2025 మధ్య నాటికి 50 శాతంగా ఉన్న దేశీయ విడిభాగాల వాటాను ఇప్పుడు వంద శాతానికి తీసుకెళ్లారు. తీవ్రమైన చలి వాతావరణంలో జామ్ అవ్వడం వంటి లోపాలు ఎదుర్కొంటున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో భారత సైన్యానికి ఆధునిక ఏకే-203లను అందిస్తారు.
భారీ ప్రాజెక్ట్ – వేగవంతమైన ఉత్పత్తి లక్ష్యం..
దాదాపు రూ. 5,200 కోట్ల ఒప్పందంతో మొత్తం 6,01,427 రైఫిళ్లను సైన్యానికి అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ తుది గడువును అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కి ముందుకు తీసుకొచ్చారు. సవరించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కోర్వా ప్లాంట్ ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ చొప్పున.. రోజుకు దాదాపు 600 రైఫిళ్లను ఉత్పత్తి చేయనుంది.
సెప్టెంబర్ 20 నాటికి పలు “షేర్” రైఫిళ్లను సైన్యానికి వినియోగదారుల పరీక్షల (User Trials) నిమిత్తం అప్పగించనున్నారు.







