- శస్త్రచికిత్సలోని భయానక నిజాలు బయటపెట్టిన న్యూరోసర్జన్లు!
Captain Smit Machchhar Skull Fracture Surgery | మిడ్-ఎయిర్ ఉగ్రవాద దాడిలో క్షేమంగా బయటపడిన ఫ్లైదుబాయ్ (flydubai) విమాన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ (Captain Smit Machchhar) ఎంతటి తీవ్రమైన ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారో తెలిపే భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్-ఖైదా భావజాలంతో రాడికలైజ్ అయిన ఒమానీ కో-పైలట్ హమామ్ అల్-హమ్మమీ గొడ్డలితో (Emergency Axe) దాడి చేయడంతో కెప్టెన్ స్మిత్ తలకు తీవ్రమైన గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన కేవలం దాడిలోనే కాకుండా, ఆ తర్వాత జరిగిన శస్త్రచికిత్సలోనూ చావును జయించారని అంతర్జాతీయ న్యూరోసర్జన్లు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల అబుదాబిలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం తీసుకుంటున్న సమయంలో కెప్టెన్ స్మిత్ తల వెనుక భాగంలో ఉన్న లోతైన గాయాలు, సర్జికల్ స్టేపుల్స్ కనిపించాయి. ఆ ఫోటోలను విశ్లేషించిన వైద్య నిపుణులు ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులను వివరించారు.
ఆపరేషన్ థియేటర్లో ‘రెండో’ ప్రాణాంతక గండం..
అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సనాత్ దీక్షిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గొడ్డలి దెబ్బల వల్ల తల వెనుక భాగంలోని ‘పోస్టీరియర్ సుపీరియర్ సాగిట్టల్ సైనస్’ (Posterior Superior Sagittal Sinus) సమీపంలో ఎముకలు తీవ్రంగా విరిగి లోపలికి దిగబడ్డాయి (Depressed Skull Fracture). ఇది మెదడు నుంచి రక్తాన్ని తీసుకెళ్లే అత్యంత ప్రధానమైన వీన్ (Vein). విరిగిన ఎముక ముక్కలను తీసే క్రమంలో ఈ రక్తనాళం తెగిపోతే కేవలం ఒక్క నిమిషంలోనే దాదాపు రెండు లీటర్ల రక్తం కారిపోయే ప్రమాదం ఉందని సిడ్నీకి చెందిన డాక్టర్ సోను భాస్కర్ వివరించారు.
40 శాతానికి పైగా మరణించే లేదా వికలాంగులయ్యే ముప్పు..
మెదడులోని ఈ భాగానికి దెబ్బతగిలి శస్త్రచికిత్స చేయాల్సి వస్తే రోగి మరణించే లేదా శాశ్వతంగా వైకల్యం బారిన పడే ప్రమాదం 40 శాతానికి పైగా ఉంటుందని వైద్యులు తెలిపారు.
తల వెనుక భాగంలో ఉన్న ‘క్రాస్’ (X) ఆకారపు గాయం మరియు సర్జికల్ స్టేపుల్స్ ఆయనకు కనీసం రెండు భారీ మెదడు శస్త్రచికిత్సలు (Wide Craniotomy) జరిగాయని తెలియజేస్తున్నాయి. సౌదీ అరేబియాలో అత్యవసర శస్త్రచికిత్స పొందిన అనంతరం, పైలట్ స్మిత్‌ను తదుపరి చికిత్స నిమిత్తం యుఏఈకి తరలించారు.
అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మమీ విమాన కాక్‌పిట్ లోపల ఉన్న అత్యవసర గొడ్డలితో కెప్టెన్ స్మిత్ తలపై పదే పదే విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రమైన రక్తస్రావం జరుగుతున్నా, కంటిచూపు మసకబారుతున్నా, స్పృహ కోల్పోతున్న స్థితిలోనూ కెప్టెన్ స్మిత్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపులను తెరిచారు. దీంతో ప్రయాణికులు, ఇతర సిబ్బంది లోపలికి వచ్చి ఉగ్రవాద కో-పైలట్‌ను మట్టుబెట్టి ఒక తీవ్ర విమాన ప్రమాదాన్ని నివారించగలిగారు.







