- డిజిపి సి.వి. ఆనంద్ సంచలన ఆదేశాలు!
DGP CV Anand Orders Cops Not To Dance In Uniform పోలీసు విధుల్లో క్రమశిక్షణ, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాకీ యూనిఫాం (Police Uniform) ధరించి పోలీసు సిబ్బంది ఎలాంటి డాన్సులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని తెలంగాణ డిజిపి సి.వి. ఆనంద్ (DGP CV Anand) ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ప్రైవేటు వేడుకలు, పండుగలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొందరు సిబ్బంది యూనిఫాంలో పాల్గొని డాన్సులు చేయడం, స్పీచ్లు ఇవ్వడం పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గౌరవానికి భంగం కలగకూడదు..
విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సిబ్బంది వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, పోలీసు యూనిఫాం అనేది అధికారం, బాధ్యత మరియు క్రమశిక్షణకు ప్రతీక అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా యూనిఫాంలో డాన్సులు చేయడం సరికాదని తెలిపారు.
జిల్లాల పరిధిలోని పోలీసు సిబ్బందికి జారీ చేసిన లేఖలలో.. ఏ పోలీసు అధికారి లేదా సిబ్బంది యూనిఫాంలో డాన్సులు చేయకూడదని, డిజిపి ఆదేశాలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉన్నతాధికారులకు పర్యవేక్షణ బాధ్యత..
ఈ ఆదేశాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి అందరూ ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీనియర్ అధికారులకు స్పష్టం చేశారు. అయితే, అధికారికంగా నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు, కవాతు వేడుకలకు (Ceremonial events) ఈ ఆదేశాలు వర్తిస్తాయా లేదా అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









