Sridhar Vembu Counters Elon Musk భారత్‌లో స్టార్‌లింక్ (Starlink) సేవలకు భద్రతా అనుమతుల ఆలస్యంపై రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని టార్గెట్ చేస్తూ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘జోహో’ (Zoho) అధినేత శ్రీధర్ వేంబు (Sridhar Vembu) ఘాటుగా స్పందించారు. మస్క్ వ్యాఖ్యలకు ‘X’ (ట్విట్టర్) వేదికగా సమగ్రమైన సమాధానం ఇస్తూ.. “ఇవీ నిజాలు ఎలాన్!” (These are the facts, Elon) అని పేర్కొంటూ భారతీయ టెలికాం, డిజిటల్ విప్లవం గురించి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఎలాన్ మస్క్ వ్యంగ్య వ్యాఖ్యలు..
భారత్‌లో స్టార్‌లింక్ అనుమతుల పురోగతి సాధించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్, అంబానీ ఏకఛత్రాధిపత్యాన్ని (Monopoly) కోరుకుంటున్నారని ఆరోపిస్తూ సంచలన ట్వీట్ చేశారు. “డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారత దేశానికి మీరే అసలైన బాస్ అని తెలుసుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి!” అని మస్క్ ఎద్దేవా చేశారు.
అలాగే, సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి, విపత్తుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి స్టార్‌లింక్ ఉపయోగపడుతుందని, అంబానీ వ్యాపార ప్రయోజనాల కోసమే తమను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు.
శ్రీధర్ వేంబు కౌంటర్..
భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత చవకైన మొబైల్ డేటా అందుబాటులో ఉండటానికి అంబానీ ప్రవేశపెట్టిన ‘జియో’నే కారణమని వేంబు కొనియాడారు. విదేశాల నుండి వచ్చే వారు కూడా వైఫై వాడకుండా భారత్‌లో మొబైల్ డేటానే వాడుతున్నారని, భారతీయులు డ్యూయల్ సిమ్ కార్డ్స్ వాడుతూ డేటా ప్రయోజనాలు పొందుతున్నారని గుర్తుచేశారు.
యూపీఐ & చవకైన మందులు..
కేవలం డేటా మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, వేగవంతమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థ (UPI) మరియు అత్యంత తక్కువ ధరల వైద్య సేవలు/ఔషధాలు భారత్‌లో లభిస్తున్నాయని, సామాన్య ప్రజలకు ఈ ఫలాలు అందుతున్నాయని వేంబు స్పష్టం చేశారు.
అమెరికా ‘రక్షణాత్మక’ విధానాలపై ప్రశ్న..
మస్క్‌కు కౌంటర్ ఇస్తూ.. అమెరికా స్వదేశీ విద్యుత్ వాహన రంగాన్ని (EV) కాపాడుకోవడానికి చైనా ఈవీలపై భారీ సుంకాలు విధిస్తోందని, తద్వారా టెక్నాలజీ విభాగంలో అమెరికా పోటీని నియంత్రిస్తోందని ఎత్తిచూపారు.
స్పేస్‌ఎక్స్‌కు భారత్ స్టార్టప్‌ల సవాలు..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశంలో స్టార్టప్ రంగానికి భారీ మద్దతు లభిస్తోందని, రాబోయే రోజుల్లో స్పేస్ రంగానికి సంబంధించి భారతీయ రోదసి స్టార్టప్‌లు స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసి స్పేస్‌ఎక్స్ (SpaceX)కే గట్టి పోటీ ఇస్తాయని జోస్యం చెప్పారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం మస్క్ ఆరోపణలను నిరాధారమైనవని స్పష్టం చేసింది. డిజిటల్ శాటిలైట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్, రిలయన్స్ జియో శాటిలైట్ మరియు భారతి ఎయిర్‌టెల్‌కి చెందిన వన్-వెబ్‌లకు సమాన స్థాయిలో సెక్యూరిటీ అసెస్‌మెంట్ (భద్రతా తనిఖీలు) జరుగుతున్నాయని, ఎవరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది.








