Hyderabad Police Ban Birthday Celebrations Tank Bund ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరియు తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నారి బర్త్‌డే నాడే విషాదం..
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది.
ఉన్నతాధికారుల తనిఖీలు..
ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.
పోలీసుల హెచ్చరికలు..
ఇళ్ల వద్దే వేడుకలు జరుపుకోవాలి..
పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేశారు.
అర్ధరాత్రి వేగంగా వచ్చే వాహనాలతో ముప్పు..
అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని, అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని గుర్తించాలని కోరారు.
జీహెచ్ఎంసీ నిబంధనలు – కఠిన చర్యలు..
ట్యాంక్‌బండ్‌పై బహిరంగంగా కేక్ కటింగ్స్, బర్త్‌డే సంబరాలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం అని, గతంలోనే జీహెచ్ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. నిరంతరం పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ దొంగచాటుగా వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, ఇకపై నైట్ పెట్రోలింగ్‌ను మరింత తీవ్రతరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.











