Banks To Be Opened On Sunday | దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఈ నెల ఆఖరులో మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లను ముందుగానే అంటే సెప్టెంబర్ 25వ తేదీన (శుక్రవారం) అందజేయాలని ఆదేశించింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ (Defence), పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాలతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, పెన్షనర్లకు సెప్టెంబర్ 25నే నగదు విడుదలవుతుంది. అక్టోబర్ నెల జీతాలలో ఈ చెల్లింపుల సర్దుబాటు ఉంటుంది.
యూఎఫ్‌బీయూ 3 రోజుల సమ్మె..
వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (UFBU) సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో సమ్మె చేపడుతోంది. సెప్టెంబర్ 26 నాలుగో శనివారం సెలవు కావడం, 28-30 సమ్మె జరగనుండటంతో ప్రజల కోసం సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పూర్తి స్థాయిలో తెరిచి ఉంచాలని ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
డిజిటల్ సేవలను వాడాలని సూచన..
అత్యవసర నిధుల విత్‌డ్రాయల్స్, లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ మార్గాలను వినియోగించుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి.







