Laddu Prasadam ATM At Kanaka Durga Temple ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవుని భక్తులకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. కనకదుర్గమ్మ సన్నిధిలో లడ్డూ ప్రసాదం పొందేందుకు వీలుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ (ATM) మిషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
కొండ దిగువన ఉన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ కలిసి ప్రారంభించారు.
భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే శ్రమ లేకుండా, డిజిటల్ పద్ధతిలో త్వరితగతిన లడ్డూ పొందడానికి ఈ సాంకేతికత దోహదపడుతుందని కమిషనర్ తెలిపారు.
యూపీఐ (UPI) ద్వారా ప్రసాదం..
భక్తులు స్కానర్ ద్వారా యూపీఐ డిజిటల్ చెల్లింపులు చేసి వెంటనే లడ్డూ ప్రసాదాన్ని పొందవచ్చు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా (ట్రయల్ రన్) అందుబాటులోకి తెచ్చామని, ఈ ప్రాజెక్ట్ పనితీరు పరిశీలించాక భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేస్తామని కమిషనర్ వివరించారు.
దళారులను ఆశ్రయించవద్దు..
దేవాలయ దర్శనాలు, సేవల పేరిట దళారీల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. పూజా టికెట్ల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు, కౌంటర్లను మాత్రమే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
దసరా నవరాత్రులకు ముమ్మర ఏర్పాట్లు..
రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశామని, ఉత్సవాల్లో సాధారణ భక్తుల దర్శనానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని అధికారులు వెల్లడించారు.







