CRPF DG Message To Soldiers | ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా భద్రతా బలగాలు అతిగా బలప్రయోగం చేశాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ పరిణామం రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారిన వేళ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జూలై 27న నిర్వహించిన CRPF పదవీ స్వీకార కార్యక్రమంలో జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా చట్టబద్ధంగా తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. “మీ విధులను నిర్భయంగా నిర్వహించండి. మీ బాధ్యతల విషయంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. జవాబుదారీతనం తీసుకోవాల్సి వస్తే డైరెక్టర్ జనరల్‌గా నేను బాధ్యత వహిస్తాను” అని తెలిపారు.
అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే CRPF నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.
జూలై 20న జంతర్‌మంతర్ వద్ద జరిగిన “సంసద్ చలో” నిరసనలో పోలీసులు, RAF సిబ్బంది టియర్ గ్యాస్, లాఠీచార్జ్, ప్లాస్టిక్ పెల్లెట్లు ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై అంతర్గత విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, మీడియా కథనాలు, జవాన్లు, కంపెనీ కమాండర్లు, ఉన్నతాధికారుల వాంగ్మూలాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
విచారణలో ప్రామాణిక విధానాలను ఉల్లంఘించినట్లు తేలితే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా, పోలీసుల చర్యలపై న్యాయపరమైన విచారణ కూడా కొనసాగుతోంది.











