Wednesday 29th July 2026
12:07:03 PM
Home > తాజా > పీవీ నరసింహారావు పేరుతో అవార్డులు.. ఎవరికంటే!

పీవీ నరసింహారావు పేరుతో అవార్డులు.. ఎవరికంటే!

PV Narasimha Rao Television Awards | తెలంగాణ ప్రభుత్వం టెలివిజన్ రంగానికి ప్రత్యేక రాష్ట్ర అవార్డులు అందించే దిశగా కీలక చర్యలు ప్రారంభించింది. మాజీ ప్రధాని, తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకుడు పీవీ నరసింహారావు పేరుతో టెలివిజన్ అవార్డులు ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులతో సమావేశమై అవార్డుల రూపకల్పనపై చర్చించారు. అవార్డు పేరు, లోగో, వివిధ కేటగిరీలు, విజేతల ఎంపిక విధానం వంటి అంశాలపై కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ, అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. బుల్లితెర అవార్డులకు పీవీ నరసింహారావు పేరు పెట్టే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

టెలివిజన్ రంగం వినోదంతో పాటు సమాజానికి విలువైన సందేశాలను అందిస్తోందని పేర్కొన్న మంత్రి, నటీనటులు, దర్శకులు, రచయితలు, యాంకర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, బాలల కార్యక్రమాలు, సామాజిక సందేశంతో కూడిన సీరియళ్లకు ప్రత్యేక కేటగిరీలు రూపొందించాలని కమిటీకి సూచించారు.

అలాగే, గద్దర్ సినీ అవార్డుల తరహాలోనే టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని, అందుకు అనువైన రెండు లేదా మూడు వేదికలను పరిశీలించాలని కమిటీ సభ్యులను కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలిపిన అనంతరం, పీవీ నరసింహారావు టెలివిజన్ అవార్డులు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions