Thursday 9th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘హెచ్-1బి, విద్యార్థి వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన చట్టాలు’:

‘హెచ్-1బి, విద్యార్థి వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన చట్టాలు’:

h1b visa process
  • ప్రతిపాదనలతో భారతీయులకు వీసా కష్టాలు..
  • పూర్తి వివరాలు ఇవే!

Trump Restricts US Immigration Rules | అమెరికాలో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై విదేశీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలు ఇనుప గజ్జెలై మారనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస విధానాన్ని మరింత క్లిష్టతరం చేసేందుకు సరికొత్త కఠిన నిబంధనలను సిద్ధం చేస్తోంది.

ప్రతిపాదిత ఈ మార్పులు అమలులోకి వస్తే, అమెరికాలో అతిపెద్ద వలస సమూహంగా ఉన్న భారతీయులపైనే అత్యంత తీవ్రమైన ప్రభావం పడనుంది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS), కార్మిక శాఖ (DOL), మరియు విదేశాంగ శాఖ (DOS) సంయుక్తంగా విడుదల చేసిన తాజా ఏకీకృత నియంత్రణ ఎజెండాలలో (Unified Regulatory Agenda) ఈ ప్రతిపాదనలను పొందుపరిచారు.

ఈ ప్రతిపాదనలు ఇంకా చట్టబద్ధంగా అమలులోకి రానప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వ వీసా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.

ఆగస్టు నుంచే ‘హెచ్-1బి’ (H-1B) వీసా షాక్?

భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు అత్యధికంగా ఆధారపడే హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని పూర్తిగా బిగించేలా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆగస్టులోనే సరికొత్త నిబంధనలను ప్రచురించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏటా లభించే 85,000 వార్షిక హెచ్-1బి వీసాల పరిమితిలో ఎలాంటి మార్పు లేకపోయినా, అర్హతలను మాత్రం కఠినతరం చేస్తున్నారు.

మినహాయింపులకు కోత..

ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కొన్ని పరిశోధనా సంస్థలకు ఉన్న హెచ్-1బి వీసా పరిమితి మినహాయింపులను (Cap Exemptions) గణనీయంగా తగ్గించనున్నారు. భారతీయ ఐటీ మరియు కన్సల్టింగ్ కంపెనీలు విస్తృతంగా ఉపయోగించే ‘థర్డ్-పార్టీ క్లయింట్ ప్లేస్‌మెంట్’ విధానంపై నిఘా పెరగనుంది.

ఉద్యోగికి, కంపెనీకి మధ్య స్పష్టమైన ‘యజమాని-ఉద్యోగి’ (Employer-Employee) బంధం ఉందో లేదో బలమైన రుజువులు చూపాలి. క్లయింట్ సైట్‌లో ఉద్యోగి చేసే ప్రత్యేకమైన పనికి సంబంధించిన అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

 గతంలో నిబంధనలు ఉల్లంఘించిన చరిత్ర ఉన్న కంపెనీల కొత్త పిటిషన్లపై తీవ్రమైన సమీక్షలు ఉంటాయి.  50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా శ్రామికశక్తి హెచ్-1బి లేదా ఎల్-1 వీసాలపై ఉన్న కంపెనీలకు (భారతీయ ఐటీ కంపెనీలు) అదనపు అనుబంధ రుసుమును (Subsidized/Additional Fees) విస్తరిస్తున్నారు.

ఇప్పటివరకు ఇది ప్రారంభ పిటిషన్లు, కంపెనీ మారే సమయాల్లోనే ఉండేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం.. వీసా పొడిగింపు (Extension) దరఖాస్తులకు కూడా ఈ భారీ ఫీజు వర్తిస్తుంది. ఇది ఐటీ సంస్థల నిర్వహణ ఖర్చులను భారీగా పెంచనుంది.

గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌ షిప్..

పెరగనున్న కనీస వేతనాలు విదేశీ కార్మికులకు గ్రీన్ కార్డ్ మరియు హెచ్-1బి స్పాన్సర్ చేయాలనుకునే అమెరికా యజమానులకు కార్మిక శాఖ (DOL) గట్టి షాక్ ఇవ్వనుంది. హెచ్-1బి మరియు PERM లేబర్ సర్టిఫికేషన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ‘కనీస వేతన స్థాయిలను’ (Prevailing Wage Levels) సవరించనున్నారు.

వేతన స్థాయిల పెంపు..

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఎంట్రీ-లెవల్ (ప్రారంభ స్థాయి) కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న 17వ పర్సంటైల్ నుండి ఏకంగా 34వ పర్సంటైల్‌కు పెంచుతారు. దీనితో పాటు ఉన్నత స్థాయి వేతనాలను కూడా సమాంతరంగా పెంచనున్నారు. దీనివల్ల కంపెనీలు విదేశీ నిపుణులకు తప్పనిసరిగా అత్యధిక జీతాలు చెల్లించాల్సి వస్తుంది.

ఫలితంగా విదేశీయులను చేర్చుకోవడానికి కంపెనీలు వెనకాడుతాయి. అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ దరఖాస్తులో కీలకమైన PERM లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియలో నియామక ప్రమాణాలను మార్చడం, అమెరికా స్వదేశీ కార్మికుల తొలగింపులపై కఠిన నియమాలు పెట్టడం, మరింత పటిష్టమైన వివక్ష వ్యతిరేక చర్యలను తీసుకురావాలని కార్మిక శాఖ భావిస్తోంది.

 అమెరికా వీసా విధానంలో ఈ తరహా అనిశ్చితి, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ (పెండింగ్) దశాబ్దాల తరబడి కొనసాగుతుండటంతో.. ప్రస్తుతం చాలా మంది భారతీయ నిపుణులు శాశ్వత నివాసం (PR) కోసం మరింత స్పష్టమైన మార్గాలున్న బ్రిటన్ (UK) వైపు తమ చూపు మళ్లిస్తున్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల ‘స్టేటస్’ ముగింపు!

2024-25 విద్యా సంవత్సరంలో భారతదేశం నుండి సుమారు 3.6 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయులదే అగ్రస్థానం. ఇప్పుడు ఈ విద్యార్థులపై కూడా ట్రంప్ నిబంధనల కోరలు సాగనున్నాయి.

నిర్దిష్ట కాలపరిమితి నివాసం..

ప్రస్తుతం అమల్లో ఉన్న “స్టేటస్ వ్యవధి” (Duration of Status – D/S) విధానాన్ని రద్దు చేయాలని DHS యోచిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులు తమ విద్యా కోర్సు నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండేందుకు వీలుండేది.

కొత్త నిబంధన వస్తే విద్యార్థులకు ఐ-20 (I-20) తో సంబంధం లేకుండా నిర్దిష్ట కాలపరిమితితో (Fixed Date) కూడిన వీసా నివాస ముద్ర వేస్తారు. ఆ గడువు ముగిసిన వెంటనే చదువు పూర్తయినా, కాకపోయినా మళ్లీ పొడిగింపు (Extension) కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఇది విద్యార్థుల చదువుపై, ఆ తర్వాత లభించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) లభ్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions