Monday 29th June 2026
12:07:03 PM
Home > తాజా >  నాగలి పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్..

 నాగలి పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్..

  • ఏరువాక పౌర్ణమి వేడుకల్లో సందడి!

Minister Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన ‘ఏరువాక పౌర్ణమి’ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా నాగలి పట్టి, దుక్కి దున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి పొలంలో నాగలి దున్ని, విత్తనాలు చల్లి ఈ ఏడాది ఖరీఫ్ (వానకాలం) వ్యవసాయ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు..

ఈ చారిత్రాత్మక వ్యవసాయ పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని రైతాంగ సోదరులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆయన ఆకాంక్షించారు.

రైతులందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని తాము భూమాతను ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.

కూరెళ్లలో ప్రారంభించడం సంతోషం..

పవిత్రమైన ఏరువాక రోజున కూరెళ్ల గ్రామంలో స్వయంగా రైతులతో కలిసి వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి వివరించారు. ఏరువాక పౌర్ణమి అనేది కేవలం ఒక రోజు కాదని, అది తెలంగాణ రైతాంగ సంస్కృతికి మరియు శ్రమజీవుల జీవన విధానానికి నిలువెత్తు ప్రతీక అని మంత్రి కొనియాడారు.

“రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని ఆకాంక్షించే పవిత్రమైన రోజు ఇది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని మన పెద్దలు చెప్పారు. సమాజానికి ఆ అన్నాన్ని అందిస్తూ, దేశాన్ని సాకుతున్న రైతే దేశానికి అసలైన వెన్నెముక.” అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి మరియు రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions