Thursday 25th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!

ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!

Leopard Trapped Inside House Masinagudi | కుక్కను వేటాడుకుంటూ ఒక చిరుతపులి ఏకంగా ఇంట్లోకి చొరబడింది. అయితే, ఆ సమయంలో భయపడిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇంటి యజమాని.. చిరుత లోపలికి వెళ్లగానే బయట నుండి తలుపుకు గడియపెట్టి తాళం వేశాడు.

దీంతో ఆ చిరుతపులి, కుక్కతో పాటు ఇంట్లోనే ఐదు గంటల పాటు బందీగా ఉండిపోయింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడి సమీపంలోని మోయార్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ  ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

మోయార్ గ్రామానికి చెందిన ఎన్. శివకుమార్ అనే చిన్నకారు రైతుకు పక్కపక్కనే రెండు ఇళ్లు ఉన్నాయి. బుధవారం రాత్రి 9:15 గంటల సమయంలో ఆయన పెంచుకుంటున్న కుక్క గట్టిగా అరవడం ప్రారంభించింది.

ఒక చిరుతపులి ఆ కుక్కను నోట కరుచుకుని వేటాడటానికి ప్రయత్నిస్తుండటాన్ని శివకుమార్ గమనించాడు. ఆ క్రమంలో కుక్క ప్రాణభయంతో పక్కనే ఉన్న చిన్న ఇంట్లోకి పరుగెత్తగా, దానిని వెంబడిస్తూ చిరుతపులి కూడా ఆ గదిలోకి చొరబడింది. వెంటనే అలర్ట్ అయిన శివకుమార్, రెండో ఇంటి గుండా బయటకు వచ్చి, చిరుత ఉన్న ఇంటి తలుపులను బయట నుండి గట్టిగా మూసి తాళం వేశాడు.

ఒకే గదిలో చిరుత, కుక్క.. కానీ:

ఇంట్లో చిక్కుకుపోయిన చిరుతపులి తీవ్ర ఆగ్రహంతో ప్రవర్తించింది. విచిత్రం ఏంటంటే.. చిరుత తన పక్కనే ఉన్నప్పటికీ ఆ కుక్కను చంపలేదు. లోపల చిరుత ఉండటంతో కుక్క భయంతో నిరంతరాయంగా మొరుగుతూనే ఉంది.

ఇల్లు లాక్ చేసిన వెంటనే శివకుమార్ స్థానికుల సహాయంతో మసినగుడి ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి, స్థానికులు ఆ కిటికీల గుండా చిరుతపులిని వీడియోలు, ఫోటోలు తీయడం ప్రారంభించారు.

జనాలు అరవడంతో చిరుత మరింత గందరగోళానికి గురై, కిటికీల వైపు దూకడానికి ప్రయత్నించింది. దీంతో అధికారులు ప్రజలను అరుపులు ఆపాలని, రాత్రి 11 గంటల కల్లా ఇళ్లకు వెళ్ళిపోవాలని సూచించారు.

ముదుమలై అధికారుల ‘ఆపరేషన్ రెస్క్యూ’..

ముదుమలై టైగర్ రిజర్వ్ (MTR) ఫీల్డ్ డైరెక్టర్ ఆర్. కిరుబా శంకర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. రాజన్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక అధునాతన ఆటోమేటిక్ బోనును (Automatic Cage) ఏర్పాటు చేశారు.

ఇంటి తలుపులు తెరవగానే, చిరుతపులి నేరుగా ఎదురుగా ఉన్న బోనులోకి ప్రవేశించి చిక్కుకుపోయింది. ఆ తర్వాత లోపల ఉన్న కుక్కను సురక్షితంగా బయటకు తీశారు. గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.

పట్టుబడిన చిరుతపులికి ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం గదిలో బంధీ అవ్వడం వల్ల కొంత ఒత్తిడికి (Stress) లోనైందని అధికారులు తెలిపారు.

అనంతరం ఆ చిరుతను సిగూర్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్‌లోకి సురక్షితంగా వదిలిపెట్టారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా, వన్యప్రాణిని బంధించిన శివకుమార్‌ను అధికారులు, స్థానికులు అభినందించారు.

You may also like
సౌత్ సీఎంలే రిచ్.. ఏడీఆర్ (ADR) నివేదికలో ఆసక్తికర అంశాలు!
ఈ20 ఇంధనం వాడితే బీమా రద్దు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం!
యువతే దేశ ప్రగతి చక్రం..: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions