Kishan Reddy Condemns CM Revanth Comments | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు (Hyderabad Metro Project) ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ వివక్ష, తానే కారణమంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి చేస్తున్నవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం ఈ విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గత ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేశానని, రాష్ట్ర అభివృద్ధిని ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు రూపాయి వచ్చినా సంతోషపడే మొదటి వ్యక్తిని తానేనని ఆయన వ్యాఖ్యానించారు.
మెట్రో ఫేజ్-2కు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం..
మెట్రో ప్రాజెక్టు విషయమై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎల్. ఖట్టర్‌తో తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
మెట్రో ఫేజ్-2 (Metro Phase-2) విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఖట్టర్ స్వయంగా ముఖ్యమంత్రితో పాటు తనకు కూడా గతంలో తెలియజేశారన్నారు.
గతంలో మెట్రో ఫేజ్-1కు కేంద్ర ప్రభుత్వం రూ. 1,250 కోట్లు ఇచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ గారే స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశారు.
దేశంలోని ఇతర నగరాల తరహాలోనే హైదరాబాద్ మెట్రో విషయంలోనూ సాంకేతికంగా చర్చించి కేంద్రం సహకరిస్తుంది తప్ప, కిషన్ రెడ్డి ఆపమంటే ఆపే సంస్కృతి బీజేపీది కాదన్నారు.
కేసీఆర్ తరహాలోనే రేవంత్ కాలయాపన..
గతంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అలైన్‌మెంట్ మార్పు పేరుతో మెట్రోను మూడేళ్లు కాలయాపన చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ. 13,500 కోట్ల ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) రుణాల వివాదంపై కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
మెట్రో ఆదాయం నుంచి ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీకి చెల్లించాల్సిన రుణాలను కట్టాలని కేంద్ర మంత్రి ఖట్టర్ సూచించగా, దానికి సీఎం రేవంత్ అంగీకరించడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏ మెట్రో సంస్థ కూడా తీసుకున్న అప్పులను ముందే చెల్లించదని, మొదట మెట్రో ఆదాయంలో ఆపరేషన్స్, మెయింటేనెన్స్ ఖర్చులు చూసుకున్న తర్వాతే రుణాలు చెల్లించాలని, అప్పుడే మెట్రో సస్టేన్ అవుతుందని తాను సీఎంకు సూచించినట్లు పేర్కొన్నారు.
ఫైనాన్స్ ఇవ్వొద్దని తాను ఏ కేంద్ర మంత్రికి చెప్పానో రేవంత్ రెడ్డి నిరూపించగలరా అని సవాల్ విసిరారు.
భేషజాలు లేవు.. కలిసి వస్తా..
ఈ సమస్యను విమర్శల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలవాలనుకున్నా, తనకు ఎలాంటి భేషజాలు లేవని, తాను కూడా సీఎంతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తెలంగాణకు రూ. 1.75 లక్షల కోట్ల హైవేలు..
తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని కిషన్ రెడ్డి తెగేసి చెప్పారు. కేంద్రం అందించిన సహకారాన్ని ఆయన గణాంకాలతో వివరించారు.
రాష్ట్రంలో రూ. 1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల (National Highways) ప్రాజెక్టులు నిర్మించామన్నారు.
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. నాడు కేసీఆర్ సహకరించకపోయినా ఎంఎంటీఎస్ ఫేజ్-2 (MMTS Phase-2) ను కేంద్ర నిధులతోనే పూర్తి చేశామని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
భూసేకరణలో వైఫల్యం..
సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేయాలని అడిగినా.. నాడు కేసీఆర్ గానీ, నేడు రేవంత్ రెడ్డి గానీ స్పందించలేదని విమర్శించారు. తెలంగాణకు ఇటీవల రూ. 11,000 కోట్ల మొత్తాన్ని 50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాలుగా ఇచ్చామన్నారు.
మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ. 4,100 కోట్ల రుణం ఇప్పించామని, ఎన్‌సీడీసీ (NCDC) కోసం 12 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ. 34,000 కోట్లు అందించామని గుర్తుచేశారు.
తాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక బిడ్డగా పాల్గొని, ఆమరణ నిరాహార దీక్ష చేశానని, పార్లమెంట్‌లో బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించానని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే తెలంగాణకు ప్రజాస్వామ్యం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







