Tuesday 21st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రమాణం చేసిన రెండు రోజులకే సీనియర్ మంత్రి రాజీనామా!

ప్రమాణం చేసిన రెండు రోజులకే సీనియర్ మంత్రి రాజీనామా!

Ramalinga Reddy Resigns From Minister Post | కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా నూతన మంత్రిమండలి కొలువుదీరిన కేవలం రెండు రోజులు కూడా గడవకముందే ప్రభుత్వంలో తీవ్ర ముసలం పుట్టింది. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ఆయన తప్పుకోవడం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంపై అసహనంః అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బెంగళూరు నగర అభివృద్ధి’ శాఖను తనకు కేటాయించకపోవడంపై రామలింగారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలోనే తన రాజీనామా పత్రంపై సంతకం చేశారు. గతంలో డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చి మరీ బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు కేటాయిస్తానని హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పుడు మాట మీద నిలబడలేదని రామలింగారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు.

 కాగా, మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మొన్నటి వరకు బెంగళూరు అభివృద్ధి శాఖను స్వయంగా డీకే శివకుమార్ నిర్వహించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కీలక శాఖను కృష్ణ బైరే గౌడకు కేటాయించారు. రామలింగారెడ్డికి బెంగళూరు అభివృద్ధికి బదులుగా ఇరిగేషన్ (నీటి పారుదల) శాఖను కేటాయించడంతో, గతంలో ఇచ్చిన హామీని సీఎం తప్పారంటూ ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

8 సార్లు ఎమ్మెల్యే..
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా, ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి ఇలా అలక పూని పదవిని వదులుకోవడం ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారి తీసింది.

You may also like
హైదరాబాద్ ఇక గ్లోబల్ బయోటెక్ లీడర్!
నెహ్రూ దశాబ్దాల రికార్డు బద్దలు.. జూన్ 10న మోదీ సరికొత్త చరిత్ర!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions