NDRF President’s Colour award | విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అరుదైన గౌరవాన్ని అందుకుంది. గడిచిన రెండు దశాబ్దాలుగా నిస్వార్థ సేవతో కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ దళానికి గురువారం ‘ప్రెసిడెంట్స్ కలర్’ (President’s Colour) పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా NDRF ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించింది. ఏదైనా సైనిక లేదా పారామిలటరీ దళం అందించే అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ పురస్కారాన్ని ‘నిషాన్’ అని కూడా పిలుస్తారు.
ఇకపై NDRF అధికారులు తమ యూనిఫాం ఎడమ చేతి స్లీవ్‌పై ఈ చిహ్నాన్ని ధరిస్తారు. “ఎక్కడ విపత్తు జరిగినా NDRF సిబ్బంది చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. తమను రక్షిస్తారనే నమ్మకం వారిలో కలుగుతుంది” అని అమిత్ షా కొనియాడారు. కేవలం 20 ఏళ్లలోనే 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసాన్ని ఈ దళం గెలుచుకుందని ఆయన ప్రశంసించారు.
జీరో క్యాజువాలిటీ లక్ష్యం.. ప్రధాని మోదీ నాయకత్వంలో విపత్తు నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరిచామని, ప్రాణ నష్టాన్ని సున్నాకు (Zero death toll) చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి అంకితభావం: ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో NDRF కేవలం మనుషులనే కాకుండా జంతువులను, ఆస్తులను కూడా రక్షించి అంకితభావాన్ని చాటుకుందని ఆయన గుర్తు చేశారు.







