CI Chinna Mallaiah rape case | ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వినుకొండ సీఐ చిన్న మల్లయ్య అదృశ్యం కావడంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
తనను అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినా, నిందితుడైన సీఐ పరారీలో ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వినుకొండ మండలం బ్రహ్మణపల్లికి చెందిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, చిన్న మల్లయ్య పరారయ్యారు.
కేవలం ఈ ఒక్క బాధితురాలే కాకుండా, గతంలో కూడా చాలామంది మహిళలను సీఐ బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ తీవ్ర ఆగ్రహం.. ఈ ఘటనపై వైసీపీ ఘాటుగా స్పందించింది. పల్నాడు, వినుకొండ ప్రాంతాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందని, ఈ అరాచక పాలన వల్లే సీఐలకు ఇంతటి ధైర్యం వచ్చిందని పార్టీ నేతలు ఆరోపించారు.
గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ నేతల అండదండలతోనే చిన్న మల్లయ్య అరాచకాలు కొనసాగిస్తున్నారని, అండ ఉంది కాబట్టే పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడంలో వెనకాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.
మహిళా రక్షణ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇలాంటి పోలీసులకు కొమ్ముకాయడానికి సిగ్గులేదా? అంటూ వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అండ ఉన్న నిందితులను చట్టం ఎలా శిక్షిస్తుందో చూడాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న మల్లయ్య పరారీలో ఉండటంతో బాధితురాలికి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.







