Friday 3rd April 2026
12:07:03 PM
Home > తాజా > రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్.. ఆ పదవి నుంచి తొలగింపు!

రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్.. ఆ పదవి నుంచి తొలగింపు!

raghav chadha

AAP Gives Shock To Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక నేతగా ఎదిగిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

గురువారం ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ అధికారికంగా లేఖ రాసింది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్‌కు చెందిన మరో ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్‌ను డిప్యూటీ లీడర్‌గా నియమించింది.

రాజ్యసభలో పార్టీ గొంతుకగా ఉన్న రాఘవ్ చద్దాను కీలకమైన డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి తప్పించారు. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, సభలో పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు మాట్లాడే సమయం కేటాయించవద్దని కూడా ఆప్ తన లేఖలో కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు రాఘవ్ చద్దా దూరంగా ఉంటున్నారని సమాచారం. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మద్యం పాలసీ కేసులో క్లీన్ చిట్ పొందినప్పుడు ఆయన స్పందించకపోవడం, కీలక సమావేశాలకు హాజరుకాకపోవడం వల్ల అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై రాఘవ్ చద్దా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను నూతన డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ కొట్టిపారేశారు. ఇది పార్టీలో జరిగే సాధారణ మార్పు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఏది ఏమైనా, ఆప్ యువ ముఖచిత్రంగా ఉన్న చద్దాను ఇలా పక్కన పెట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions