KBK Hospital & Pavan Babu Mohan Trust Health Camp | సామాజిక సేవలో భాగంగా కేబీకే హాస్పిటల్ మరియు పవన్ బాబూ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.
ఎల్బీ నగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మార్చి 21, 22 తేదీల్లో జరిగిన ఈ శిబిరానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. సీనియర్ నటులు, మాజీ మంత్రి బాబూ మోహన్ మరియు కేబీకే హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని, ఇలాంటి శిబిరాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేబీకే హాస్పిటల్, పవన్ బాబూ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులకు నిపుణులైన వైద్యులతో ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.రోగుల ఆరోగ్య స్థితిని బట్టి జనరల్ చెకప్స్ నిర్వహించారు.
బీపీ, షుగర్ స్థాయిలను పరీక్షించడంతో పాటు, కిడ్నీ సంబంధిత సమస్యలను గుర్తించేందుకు రక్త నమూనాలను సేకరించారు. పరీక్షల అనంతరం బాధితులకు తదుపరి చికిత్స గురించి వైద్యులు విలువైన సూచనలు చేశారు. పేద ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.










