- ఇరాన్ వల్ల ముప్పు లేదు..
- మనస్సాక్షికి విరుద్ధంగా యుద్ధం!
Joseph Kent Comments On War | పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పోరు మూడవ వారానికి చేరుకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన సొంత యంత్రాంగం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) డైరెక్టర్ జోసెఫ్ కెంట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మనస్సాక్షికి విరుద్ధంగా సాగుతున్న యుద్ధం
రాజీనామా లేఖలో కెంట్ సంధించిన విమర్శలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. “ఇరాన్‌పై సాగుతున్న ఈ యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను. ఇది నా మనస్సాక్షికి విరుద్ధం” అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పు (Immediate Threat) లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఇజ్రాయెల్ లాబీ వల్లే యుద్ధం?
ఈ యుద్ధం వెనుక ఇజ్రాయెల్ మరియు అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల లాబీల ఒత్తిడి ఉందని కెంట్ సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ అధికారులు, మీడియా తప్పుడు సమాచారంతో ట్రంప్‌ను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు.
ఈ యుద్ధం వల్ల అమెరికన్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని, పైగా ప్రజల జీవితాలు, సంపద వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ట్రంప్ చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ విధానానికే విరుద్ధమని గుర్తు చేశారు. గతంలో యుద్ధాలను నివారించినట్లే, ఇప్పుడు కూడా అదే దారిలో నడవాలని ట్రంప్‌కు కెంట్ సూచించారు.
ట్రంప్ ఘాటు స్పందన
జోసెఫ్ కెంట్ రాజీనామాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. కెంట్ వెళ్లిపోవడమే మంచిదని, ఆయన నిర్ణయాన్ని తాను పెద్దగా పట్టించుకోవడం లేదని కొట్టిపారేశారు.
అయితే, కీలకమైన కౌంటర్ టెర్రరిజం విభాగం అధిపతే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ బయటకు రావడం ట్రంప్ విదేశీ విధానంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.






