KSRTC Conductor Humanity | విధి నిర్వహణలో నిబంధనలే కాదు, మానవత్వం కూడా ముఖ్యమని నిరూపించారు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి చెందిన ఒక బస్సు కండక్టర్.
పదో తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో మార్చి 18 నుండి పదో తరగతి (SSLC) బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడకూడదని సదరు కండక్టర్ తన డ్రైవర్‌కు కీలక సూచన చేశారు.
“పదో తరగతి విద్యార్థులు ఎక్కడ లిఫ్ట్ అడిగినా బస్సు ఆపండి.. వారికి రేపటి నుండే బోర్డు పరీక్షలు ఉన్నాయి. మనం కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, వారి భవిష్యత్తు ముఖ్యం. వారిని ఆదుకుందాం” అని డ్రైవర్‌తో చెప్పారు.
అంతేకాకుండా, మార్గమధ్యలో ఎదురైన ఇతర బస్సుల సిబ్బందికి కూడా ఇదే విషయాన్ని విన్నవిస్తూ, విద్యార్థులకు సహకరించాలని కోరారు.
విధి నిర్వహణలో కేవలం టిక్కెట్లు జారీ చేయడమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేసిన ఆ కండక్టర్ తీరుపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“కర్ణాటక స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదు, మానవత్వానికి నిదర్శనం” అంటూ నెటిజన్లు ఈ వార్తను షేర్ చేస్తున్నారు.






