Meta Says Sorry To CM Siddaramaiah | ఇటీవల సీనియర్ నటి సరోజాదేవి (Saroja Devi) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సంతాపం తెలుపుతూ కర్ణాటక సీఎంఓ (Karnataka CMO) ఫేస్ బుక్ లో కన్నడలో ఓ పోస్టు పెట్టింది.
సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) బహుభాషా తార, సీనియర్ నటి బి. సరోజాదేవి పార్థీవదేహానికి కడసారి నివాళులర్పించారని అందులో పేర్కొంది. దీన్ని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఇంగ్లిష్ లో తప్పుగా అనువదించింది. ఈ విషయమై స్పందిస్తూ సీఎం సిద్ధరామయ్య మెటా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యకు మెటా క్షమాపణ చెప్పింది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించినట్లు మెటా తెలిపింది. ఈ పొరపాటుకు ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది.
ఏఐ టూల్ తప్పిదం వల్ల అనువాదంలో పొరపాటు దొర్లిందని సంస్థ ఫేస్‌బుక్ ద్వారా మెటా వెల్లడించింది. ఏఐ సాంకేతికతను మెరుగుపరచుకునే ప్రాసెస్‌లో ఉన్నామని, ఇందులో భాగంగానే తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చింది.









