- విమర్శలపై బహిరంగ లేఖ
Singer Mangli Open Letter | ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ టీడీపీ (Telugu Desam Party) శ్రేణులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని స్వయంగా టీడీపీ ఎంపీ ఆలయానికి తీసుకెళ్లడం ఏంటని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై తాజాగా మంగ్లీ స్పందించారు. తాను దేవుడి కార్యక్రమానికి వెళ్తే, తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడాను కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదని తెలిపారు.
వైసీపీతోపాటు అన్ని పార్టీల లీడర్లకు తాను పాటలు పాడానని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీకి పాట పాడటం వల్ల తాను చాలా అవకాశాలు కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. వైకాపాకు పాడినందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు.
నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలి కానీ, పార్టీల పాట కాకూడదన్నది నా అభిప్రాయం. అందుకే 2024లో ఎన్నికల్లో ఏ పార్టీకీ నేను పాటలు పాడలేదని మంగ్లీ తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి తాను పాట పాడను అన్నది అవాస్తవమని కొట్టి పారేశారు మంగ్లీ.
రాజకీయ లబ్ధి కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో తనపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానీ, ఒక కళాకారిణిగా తనకు తన పాటే అన్నింటికన్నా ముఖ్యమని వెల్లడించారు. తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు.











