Friday 22nd November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > ఎన్నికల ముందు ఆరోపణలు.. బీఆరెస్ లో అందరి చూపు ఆ ముగ్గురి వైపే!

ఎన్నికల ముందు ఆరోపణలు.. బీఆరెస్ లో అందరి చూపు ఆ ముగ్గురి వైపే!

BRS Office

BRS MLAs | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కానీ రాష్ట్రం అప్పుడే రాజకీయ వేడి రాజుకుంటోంది.

ఎన్నికల్లో టికెట్ల కోసం అన్ని పార్టీల అభ్యర్థులు తమ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. మరోవైపు నియోజవర్గాల్లో తమ బలాబాలాన్ని చాటుకుంటున్నారు.

ఎంతకాదన్నా ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ ఢీకొట్టే నాయకుడు తెలంగాణలో లేడని చెప్పడంలో సందేహం లేదు. గత ఎన్నికల్లో అది తేట తెల్లమైంది.

ఓవైపు ప్రతి పక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతుంటే.. కేసీఆర్ ఏకంగా పాతవాళ్లకే టికెట్లు అంటూ అనౌన్స్ చేసి ప్రచారంలో ముందజలో నిలిచారు.

ఫలితంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు.

అప్పట్లో కేటీఆర్ అన్నట్లు వాళ్లు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకుందాం అనే మాటలను నిజం చేసుకున్నారు.

తాజాగా నవంబర్ లేదా డిసెంబర్ లో జరిగే ఎన్నికలకు కూడా కేసీఆర్ మరో వ్యూహంతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వారం పది రోజుల్లోనే అభ్యర్థులను కన్ ఫాం చేస్తారని ఇటీవల వచ్చిన వార్తలే అందుకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్యేల్లో కాస్త గందరగోళం నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందా లేదా కంగారు పడుతున్నారు.

అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడం కోసం కొంతమంది అప్పుడే ప్రజాబాట పెట్టి ఓట్ల వేటకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

అయితే మిగతా వారి పరిస్థితి ఇలా ఉంటే.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బీఆరెస్ లో ఆ ముగ్గురు వేరయా అన్నట్టు ఉంది ఓ ముగ్గురి నేతల దుస్థితి.

ఇంకో వారం, పది రోజుల్లో బీఆరెస్ పార్టీ 2023 లో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో అందరి చూపు ఆ మూడు నియోజకవర్గాల పైనే ఉంది.

అస్సలు ఆ ముగ్గురిని కేసీఆర్ ఆశీర్వ దిస్తాడా లేక తిరస్కరిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

కారణం ప్రస్తుతం ఆ ముగ్గురు వివాదాల్లో నిలుస్తున్నారు. అయితే ఆ వివాదాలు అవినీతి ఆరోపణలో లేదా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడమో కాదు.

అవి సాదాసీదా వివాదాలు కూడా కాదు. ఏకంగా ఇద్దరు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఎమ్మెల్యేకు తన సొంత కూతురు నుంచే ప్రతిఘటన ఎదరయ్యింది. ఇంతకీ ఆ ముగ్గురు నేతలెవరో అర్థమయింది కదా!

ఎస్.. వారిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి.

ఢిల్లీలో శేజల్ పోరాటం..

ఆరిజిన్ పాల సంస్థలో భాగస్వామి గా ఉన్న శేజల్ అనే మహిళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేశారు.

అమ్మాయిలను పంపించాలని తనపై ఒత్తిడి చేశాడనీ, మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.

అలాగే తనకు తగిన న్యాయం కావాలని ఏకంగా సీఎం కేసీఆర్ ఇంటి ముందే ధర్నాకు దిగారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన శేజల్ బీఆరెస్ ఎంపీలను కలిసి, ఫిర్యాదు కూడా చేశారు. ఇది నియోజకవర్గంలో పెద్ద దుమారంగా మారింది.

రాజయ్య వర్సెస్ సర్పంచ్..

స్టేషన్ ఘనపూర్ విషయానికి వస్తే ఎమ్మెల్యే రాజయ్య గత కొన్ని రోజులుగా తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.

కొంతకాలం కిందట నియోజకవర్గంలోని జానకీ పురం సర్పంచ్ నవ్య.. తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది.

ఆ తర్వాత రాజయ్య ఆమె ఇంటికి వెళ్లి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్లు కనిపించింది. తాజాగా ఆ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది.

 ఇటీవల ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే తనను లైంగికంగా లొంగదీసుకోవలాని ప్రయత్నించడాని ఆరోపించారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఆమె పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయం లో నిజానిజాలు ఎలా ఉన్నా నియోజకవర్గం లో మాత్రం రాజయ్యకు మాత్రం జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

ఫాదర్ వర్సెస్ డాటర్..

బెల్లంపల్లి, ఘన్ పూర్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిది విచిత్రమైన పరిస్థితి. ఆయన ప్రతిపక్షాలకంటే ఎక్కువగా తన కుమార్తె నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి తన తండ్రిపైనే భూకబ్జా ఆరోపణలు చేశారు. కేవలం ఆరోపణలు కాకుండా రెండు మూడు సందర్భాల్లో ఎమ్మెల్యే ప్రజల్లో ఉండగానే అందరి ముందు తన తండ్రి అక్రమాలను ప్రశ్నించారు.

చేర్యాల పరిధికి చెందిన భూమిని తన తండ్రి అక్రమంగా కబ్జా చేసి బలవంతంగా బెదిరించి, తన పేరుపై రిజిస్టర్ చేయించారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. 

 అంతటితో ఆగకుండా తన పేరు పైన రిజిస్టర్ అయిన భూమిని తిరిగి గ్రామానికి అప్పగించారు. తన సొంత కూతురి చర్యల వల్ల యాదిరెడ్డి కంటనీరు కూడా పెట్టుకున్నారు.

అయిన తన కూతురు మాత్రం క్షమించలేదు. ఈ విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

అలాగే నియోజకవర్గం లో కూడా తన ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీ వాళ్ళు కూడా దీనిని తెగ ప్రచారం చేయడం ఎమ్మెల్యే కు ఇబ్బంది గా మారింది.

ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.

ఆ ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రజల దృష్టిలో తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకొని గులాబీ బాస్ చేయించే సర్వేల్లో మంచి ఫలితాలు సాధిస్తార లేదా అనేది చూడాలి.

ఒకవేళ సర్వే లో సానుకూల ఫలితాలు వచ్చిన వీరిపై ఉన్న ఆరోపణలకు వీరికి టికెట్స్ ఇస్తారా అనేది కూడా అనుమానమే.

అలాగే ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆరెస్ కి చెందిన ఇతర నాయకులు వీరిపై  వచ్చిన ఆరోపణలను సాకుగా చూపిస్తూ ప్రజల్లో వీరికి వ్యతిరేకత ఉందని అధిష్టానం వద్ద చెబుతున్నారట.

తమకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తామని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఏది ఏమైనా అంతిమ నిర్ణయం గులాబీ బాస్ దే!

You may also like
harish rao
ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!
vemula veeresham
టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!
telangana high court
‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!
ktr
మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. వారికి రూ. 5 లక్షల సాయం అందజేత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions