16-year-old Telangana girl murders mother with boyfriend | జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అంజలి హత్య కేసు సంచలనం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న కన్న కూతురే తల్లి అంజలిని హత్య చేసిందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
24 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ‘ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల శివతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పదో తరగతి చదువుతున్న అంజలి కుమార్తెకు ఎనమిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
జూన్ 19న బాలిక ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దింతో తల్లి అంజలి జూన్ 20న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే జూన్ 20 రాత్రి బాలిక ఇంటికి తిరిగివచ్చింది. అయితే కొన్ని నెలలుగా ప్రేమ విషయంలో అడ్డు వస్తుందని బాలిక తల్లితో గొడవ పడుతుంది.
ఈ క్రమంలో జూన్ 23న షాపూర్ నగర్ లోని నివాసంలో తల్లి అంజలి పూజ చేస్తుండగా పథకం ప్రకారం చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. అంజలి కుమార్తె 16 ఏళ్ల బాలిక, ఆమె ప్రియుడి 19 ఏళ్ల శివ, అతడి తమ్ముడు ఈ హత్యలో పాల్గొన్నారు. తొలుత చున్నీతో అంజలి గొంతు నులిమారు.
అయితే ఆమె చనిపోయిందనుకున్నారు. కానీ అంజలి ఇంకా ప్రాణంతోనే ఉందని గ్రహించిన కుమార్తె, మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేయడంతో మళ్ళీ వాళ్ళు వచ్చి చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయం దర్యాప్తులో తేలింది.
ప్రేమ విషయంలో అడ్డు వస్తుందనే తల్లిని హత్య చేసినట్లు ఈ కేసులో నిందితురాలైన కుమార్తె దర్యాప్తులో తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించాం’ అని డీసీపీ తెలిపారు.








