Varanasi Ganjari Cricket Stadium ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ అయిన గంజరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ స్టేడియం దాదాపు 92% నిర్మాణ పనులను పూర్తి చేసుకుని, తుది దశకు చేరుకుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజ్ శుక్లా వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఒక ట్రయల్ మ్యాచ్ నిర్వహించాలని అధికారులు యోచిస్తుండగా, 2027లో ఈ వేదికపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
శివ థీమ్ వాస్తుశిల్పం.. కాశీ ఆధ్యాత్మిక శోభ..
రాజతలాబ్ తహసీల్‌లోని గంజరి గ్రామంలో సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో, 31 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 32 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం గల ఈ స్టేడియం డిజైన్ శివుని థీమ్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ఢమరుకం ఆకారంలో మీడియా సెంటర్..
ఢమరుకం ఆకారంలో ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను నిర్మించారు. మైదానంలో త్రిశూలం ఆకారంలో నాలుగు వీధి దీపాలు (ఫ్లడ్‌లైట్లు) ఏర్పాటు చేశారు. శివుని నుదుటిపై ఉండే చంద్రుని ఆకారం నుండి ప్రేరణ పొంది స్టేడియం పైకప్పును రూపొందించగా, ప్రేక్షకుల గ్యాలరీని కాశీ గంగా ఘాట్ల మెట్ల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు.
ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ..
మైదానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల.. ఎడతెరిపి లేకుండా 1-2 గంటలు వర్షం కురిసినా, కేవలం 30 నిమిషాల్లోనే మైదానాన్ని ఆటకు సిద్ధం చేయవచ్చు. 2023 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ స్టేడియం అందుబాటులోకి రావడం వల్ల పూర్వాంచల్ ప్రాంత క్రీడాకారులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయి. క్రీడలతో పాటు వారణాసి ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం మరియు ఉపాధి రంగాలకు ఇది భారీ ఊతాన్నిస్తుందని భావిస్తున్నారు.







