Girl Freind Sketch | తనను దూరం పెడుతున్నాడనే కోపం తో మాజీ ప్రియుడ్ని గంజాయి విక్రయం కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది ఒక యువతి. వివరాల్లోకి వెళ్తే అమీర్ పేట్ లో ఒక ఫైనాన్స్ కంపెనీలో కలసి పనిచేస్తున్న రింకి అనే లా విద్యార్థి, శ్రవణ్ అనే యువకుడు కొంత కాలం ప్రేమించుకున్నారు.
అయితే కొద్దీ రోజులుగా రింకి ని దూరం పెడుతున్నాడు శ్రవణ్. దీంతో ప్రియుడి పై పగ పెంచుకున్న రింకి తన స్నేహితులతో కలిసి ఒక్కొటి 8 గ్రాముల చొప్పున 5 ప్యాకెట్ల గంజాయి సేకరించింది. అనంతరం స్నేహితుల సహాయంతో శ్రవణ్ ను జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ కు రప్పించింది.
అందరూ పబ్ లో ఉండగా రింకి మాత్రం పోలీసులకు ఫోన్ చేసి శ్రవణ్ కారులో గంజాయి ఉందని సమాచారం అందించింది. పోలీసులు శ్రవణ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆ కారు తనది కాదని, వేరే వాళ్ళ కారులో వచ్చానని చెప్పాడు.
దీంతో కారులో వచ్చిన వారందరినీ విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడి పై కక్షతోనే రింకి ఇలా చేసిందని తేల్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. రింకి తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.