Gandhi Jayanthi 2022 | భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో గాంధీ సమకాలీనులకు ఈ పురస్కారం దక్కింది.
కానీ, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి శాంతి మార్గం చూపిన గాంధీకి భారతరత్న అవార్డును ప్రకటించలేదు. కారణమేంటో తెలుసా..

భారతరత్న పురస్కారాన్ని తొలిసారి 1954లో ప్రకటించారు. కానీ, గాంధీ 1948లోనే మరణించారు. అప్పట్లో భారతరత్నను బతికి ఉన్నవాళ్లకు మాత్రమే ప్రదానం చేసేవారు.
ఆ తర్వాత అవార్డు నిబంధనలు మార్చి, మరణించిన వారికి కూడా భారతరత్న పురస్కారం ప్రకటించారు. మహాత్ముడి తర్వాత మరణించిన వారికి కూడా భారతరత్న పురస్కారం దక్కింది.
ఆఖరికి ఇద్దరు విదేశీయులు కూడా ఈ అవార్డు ప్రకటించింది మన దేశ ప్రభుత్వం. కానీ గాంధీకి మాత్రం భారతరత్న ఇవ్వలేదు. గాంధీకి కూడా భారతరత్న పురస్కారం అందజేయాలనే వాదన తెరపైకి వచ్చింది.
ఈ విషయంపై అనేక సార్లు సుప్రీం కోర్టు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రతీసారి ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ వచ్చింది. గతేడాది కూడా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ సందర్బంగా విచారణ చేపట్టిన ధర్మాసనం గాంధీకి భారతరత్న ఎందుకు వద్దో వివరించింది. మహాత్ముడు జాతి పిత. ఆయనను ప్రజలు మహోన్నత గౌరవంతో చూస్తారు.
అలాంటి వ్యక్తి స్థాయి ఏ గుర్తింపునకైనా ఎక్కువే అని వ్యాఖ్యానించింది ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం. గాంధీజీ భారతరత్న పురస్కారం కంటే ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు.
ప్రజలు ఆయన్ను ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తారనీ.. అలాంటప్పుడు ఆయనకు భారతరత్న ఎందుకు అని ప్రశ్నించారు.
భారతరత్న దేశంలోనే అత్యున్నత పురస్కారం. అయితే మహాత్మా గాంధీ అంతకంటే అత్యున్నతమైన వ్యక్తి.
మహాత్మా గాంధీని మరియు భారతరత్నను రెండూ పక్కపక్కన పోల్చలేం. భారతదేశం మహాత్మా గాంధీని భారతరత్న కంటే గొప్పదిగా భావించింది.
అందుకే గాంధీ ఔన్నత్యం ముందు భారతరత్న పురస్కారం కూడా చాలా చిన్నదని దేశం భావించింది.
Also Read: KCR National Party.. ఆ పేరువైపే గులాబీ బాస్ మొగ్గు.. నేడు కీలక ప్రకటన!?
నోబెల్ పురస్కారం..
ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ ప్రైజ్. అందులోనూ నోబెల్ శాంతి బహుమతి చాలా ప్రత్యేకం. అయితే ప్రపంచానికి శాంతిని, అహింసా మార్గాన్ని పరిచయం చేసిన గాంధీకి మాత్రం నోబెల్ శాంతి బహుమతి లభించలేదు.
కానీ.. నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు.
ఆయణ్నివరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
చివరగా 1948లోనూ మరోసారి బాపూజీని నామినేట్ చేశారు. కానీ తర్వాత నాలుగు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు.
ఆ సమయంలో మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇచ్చేవారు కాదు. కానీ, అప్పుడు మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో నోబెల్ పురస్కారం మరణానంతరం కూడా ఇవ్వవచ్చని భావించింది కమిటీ.
అప్పుడు కమిటీకి మరో ప్రశ్న ఉత్పన్నమైంది. గాంధీ జీవించి లేరు కాబట్టి, శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి. గాంధీకి ట్రస్టుగానీ, సంఘం గానీ లేవు.
ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దీంతో ఆ ఏడాది ఎవరికీ నోబెల్ పీజ్ ప్రైజ్‌ను ప్రకటించలేదు.
అయితే 1989లో దలై లామాకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన తర్వాత గాంధీకి ఇవ్వలేకపోయామన్న పశ్చాత్తాపం నోబెల్ కమిటీ మెంబర్లలో కలిగిందని ఆ ఫౌండేషన్ తన వ్యాసంలో పేర్కొంది.