Saturday 9th August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘గోవులు మృతి అంటూ వ్యాఖ్యలు..టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర’

‘గోవులు మృతి అంటూ వ్యాఖ్యలు..టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర’

TTD Chairman BR Naidu News | టిటిడి గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. ఆదివారం టిటిడి గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా, అధికారులతో కలసి పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

టిటిడి గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపించారని సదరు ఫోటోలను మీడియాకు చూపించారు. టిటిడి ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు.

ప్రతీ రోజూ అసత్య ఆరోపణలు, పచ్చి అపద్దాలతో టిటిడి సంస్థ మీద బురద చల్లుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నవారు జీరో అవుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తన మీద ఏమైనా ఉంటే ఆరోపించుకోవచ్చు కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ నాయుడు హెచ్చరించారు.

టిటిడి గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే శ్రీవేంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరన్నారు. ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలను ఇలాగే చేయగలరా అని, హిందువులపై ఎందుకంత ధ్వేషమని ప్రశ్నించారు.

కరుణాకర్ రెడ్డికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేకనే రోజూ ఏదో ఒక విధంగా అపద్దాలను మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. టిటిడి సంస్థపై ఏదైనా నిజాలు చెబితే సరిదిద్దుకుంటామని కానీ బురద చల్లితే ఊరుకోమన్నారు.

You may also like
‘ది ప్యారడైజ్’..’జడల్’ గా రాబోతున్న నాని
‘కీళడి’ కోసం..ప్రధానిని కలిసిన కమల్ హాసన్
‘వావివరుసలు లేవు..సొంత కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేశారు’
‘ఐదు రకాల ఓట్ల చోరీ’..ఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions